- చెరువు స్థలాన్ని ఆక్రమించి షట్టర్లు
- కిరాయికి ఇచ్చి నెలకు రూ.17 లక్షల వరకు వసూలు
- ఆక్రమణలు కూల్చేసి ఫెన్సింగ్ వేసిన హైడ్రా
మియాపూర్, వెలుగు: శేరిలింగంపల్లిలో అత్యంత విలువైన ఐదెకరాల ప్రభుత్వ భూమికి కబ్జా చెర నుంచి విముక్తి కలిగింది. శేరిలింగంపల్లి మండలం మియాపూర్ విలేజ్ మక్తామహబూబ్ పేటలో ఐదెకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు కబ్జాదారుల నుంచి రక్షించి ఫెన్సింగ్ వేశారు. మియాపూర్–- బాచుపల్లి ప్రధాన రహదారికి సమాంతరంగా ఉన్న ఈ చెరువు కట్టపై 200 మీటర్ల మేర వేసిన 18 షట్టర్లను అధికారులు తొలగించారు. దుకాణాల వెనుక వైపు ప్రైవేటు బస్సుల పార్కింగ్ కోసం ఉపయోగిస్తున్న స్థలాన్ని కూడా ఖాళీ చేయించారు.
ఈ ఐదెకరాల ప్రభుత్వ భూమి విలువ రూ.600 కోట్లకుపైగానే ఉంటుందని హైడ్రా అధికారులు తెలిపారు. మియాపూర్ సర్వే నంబర్ 39లో మక్తామహబూబ్‌పేట చెరువు కట్ట కబ్జాతో పాటు గతంలో మైనింగ్‌కు ఇచ్చిన సర్వే నంబరు 44/5 లోని ఐదెకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
ఒక్కో షట్టర్ నుంచి నెలకు రూ.50 వేల చొప్పున రూ.9 లక్షల వరకు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రైవేటు బస్సుల పార్కింగ్‌కు స్థలాన్ని ఇచ్చి నెలకు రూ.8 లక్షల వరకు దండుకుంటున్నారని అందులో ప్రస్తావించారు. దీంతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలతో హైడ్రా అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. సర్వే నంబర్లు మార్చి ఐదెకరాలను కబ్జా చేసిన కొందరు.. బడాబాబుల అండతో సర్వే నంబర్44/5 కు బదులు 44/4 నంబర్ సృష్టించారు. అంతేకాకుండా కారు వాషింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసుకుని మొత్తం భూమిని కబ్జా చేశారు.
మైనింగ్‌కు ఇచ్చిన భూమి గడువు పెంచాలని దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం నిరాకరించడంతో ఆ భూమిలోనే తప్పుడు సర్వే నంబరు(44/4) తో కబ్జాకు పాల్పడినట్టు వెల్లడైంది. కబ్జాకు పాల్పడిన కూన సత్యం, బండారి అశోక్ వెనుక బడాబాబులు ఉన్నారని హైడ్రా అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ భూమి తమదని చెబుతున్న వారి వద్ద ఎలాంటి పత్రాలు లేకపోవడంతో ప్రభుత్వ స్థలంలో వెలసిన షెడ్లను కూల్చివేసి, భూమి చుట్టూ ఫెన్సింగ్ వేశారు. ఈ భూమికి ఆనుకుని ఉన్న ఐదెకరాల చెరువు కబ్జా ప్రయత్నాలకు కూడా హైడ్రా అధికారులు చెక్ పెట్టారు.

