
హైదరాబాద్ సిటీ, వెలుగు: చెరువుల పునరుద్ధరణ పనులు వేగంగా జరగాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అధికారులను ఆదేశించారు. మొదట విడతగా చేపట్టిన 6 చెరువుల పునరుద్ధరణ పనులు త్వరగా పూర్తి కావాలన్నారు. సోమవారం సున్నం చెరువును ఆయన పరిశీలించారు. దీంతో పాటు నార్సింగ్ వద్ద సీఎస్ఆర్లో భాగంగా తత్వ రియల్ ఎస్టేట్ సంస్థ చేపట్టిన ముష్కి చెరువును సందర్శించారు. సున్నం చెరువులో డెబ్రీస్‌ను తొలగించే పనులను పర్యవేక్షించారు.
చెరువులోకి వరద నీరు నేరుగా చేరేందుకు వీలుగా వెంటనే ఇన్లెట్లను సిద్ధం చేయాలని ఆదేశించారు. చెరువు పైభాగంలోని ప్రాంతాల్లో వరద సాఫీగా కిందకు సాగడంలేదనే ఫిర్యాదుల నేపథ్యంలో చెరువు ఇన్లెట్ల అవసరాలను వివరించారు. అలాగే మురుగు కాలువ డైవర్షన్ పనులు కూడా పూర్తి కావాలన్నారు. ఈ వర్షాకాలంలోనే చెరువుల పునరుద్ధరణ జరగాలని సూచించారు.