ప్రభుత్వ జాగాలు కబ్జా చేసినోళ్ల ఆస్తులు జప్తు చేస్తం..సీబీఐ, ఈడీ తరహాలో నిందితులపై చర్యలు తీసుకుంటం:హైడ్రా 

ప్రభుత్వ జాగాలు కబ్జా చేసినోళ్ల ఆస్తులు జప్తు చేస్తం..సీబీఐ, ఈడీ తరహాలో నిందితులపై చర్యలు తీసుకుంటం:హైడ్రా 
  • బీఎన్‌‌ఎస్‌‌ఎస్‌‌ చట్టం ప్రకారం మాకు అన్ని అధికారాలు ఉన్నయ్​
  • ఆస్తుల అటాచ్​పై అధికారులు, సిబ్బందికి త్వరలో ట్రైనింగ్ ఇస్తం
  • బడా బాబుల ఆక్రమణలపై రాజీ పడే ప్రసక్తే లేదు: కమిషనర్​ రంగనాథ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేసిన బడా బాబుల ప్రాపర్టీని జప్తు చేస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌‌ చెప్పారు. సీబీఐ, ఈడీ తరహాలో కేసులు నమోదు చేసి, చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ భూములను కబ్జాలు చేసి, దాని ద్వారా వేరే ప్రాంతాల్లో సంపాదించిన ఆస్తులను చట్ట ప్రకారం అటాచ్ చేసి స్వాధీనం చేసుకుంటామని వెల్లడించారు. ఈ విషయంలో భారతీయ నాగరిక్‌‌ సురక్ష సంహిత (బీఎన్‌‌ఎస్‌‌ఎస్‌‌) 117 ప్రకారం అన్ని అధికారాలు హైడ్రాకు ఉన్నాయని తెలిపారు.

ఆస్తుల అటాచ్‌‌కి సంబంధించిన హైడ్రా అధికారులు, సిబ్బందికి త్వరలో ట్రైనింగ్ నిర్వహిస్తామని చెప్పారు. హైడ్రా పోలీసు స్టేషన్ విధులు, తీసుకునే చర్యలను ఆయన గురువారం ‘వెలుగు’దినపత్రికతో పంచుకున్నారు. ప్రస్తుతం హైడ్రా పోలీసు స్టేషన్ అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. అయితే, నేరుగా హైడ్రా పీఎస్‌‌లో కేసులు నమోదు చేయబోమని, జీవో ప్రకారం కమిషనర్ ఆదేశాలతో మాత్రమే కేసులు నమోదు పెడతామని వెల్లడించారు.

ప్రభుత్వ భూముల ఆక్రమణలపై వస్తున్న ఫిర్యాదులపై నేరుగా కేసులు నమోదు చేసే అధికారం తమకు లేదని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కేసులు పెట్టడానికి వీల్లేదన్నారు. ఫిర్యాదులపై ముందుగా ప్రిలిమినరీ విచారణ జరిపి.. వాటిని నిర్ధారించుకొని, తర్వాత కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. అయితే, ఆధారాలతో దొరికిన వారిపై మాత్రం డైరెక్ట్‌‌గా కేసులు పెడతామని చెప్పారు. ప్రభుత్వ భూముల్లో పెన్సింగ్‌‌ వేయడం, నిర్మాణాలు జరపడం, చెరువుల్లో డంప్ చేస్తున్న కేసుల్లో నిందితులను రెడ్ హ్యండెడ్ పట్టుకొని వెంటనే కేసులు పెడతామని తెలిపారు.

కబ్జాకు గురైన ప్రభుత్వ భూములు, చెరువులను చట్టపరిధిలోనే స్వాధీనం చేసుకుంటామన్నారు. హైడ్రా పీఎస్‌‌ను ప్రస్తుతం సగం మంది స్టాఫ్‌‌తో రన్ చేస్తామని, పూర్తిస్థాయి అధికారులు, సిబ్బందిని ప్రభుత్వం త్వరలో కేటాయిస్తుందని వెల్లడించారు. బడాబాబుల విషయంలో రాజీ పడేది ఉండదని, ఈ అంశంపై ప్రభుత్వం, సీఎం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. 

హైడ్రాకు ప్రత్యేక కోర్టు..

హైడ్రాకు ఇదివరకు ప్రత్యేకంగా కోర్టు లేదని, ఇకపై ఈ కేసులు వాదించేందుకు నాంపల్లి 9వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ క్రిమినల్ కోర్టుని కేటాయించిందని రంగనాథ్ తెలిపారు. ప్రత్యేక కోర్టు వల్ల కేసులు త్వరగా విచారించేందుకు వీలుంటుందని చెప్పారు. ప్రభుత్వం నుంచి తమకు అన్ని విధాలుగా సపోర్టు ఉందన్నారు. హైడ్రా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 48 యాక్షన్స్ తీసుకోగా.. 450 ఎకరాలు కాపాడామని వెల్లడించారు.

సుమారు దీని విలువ రూ.20 వేల కోట్ల వరకు ఉంటుందని తెలిపారు. మరోవైపు, హైడ్రాకు సామాన్య ప్రజల నుంచి మద్దతు ఉందని, కేవలం బడాబాబులు మాత్రమే విమర్శిస్తున్నారని రంగనాథ్ అన్నారు. సామాన్య ప్రజలు ప్రభుత్వ ఆస్తులను కబ్జాలకు పాల్పడబోరని, ఒకవేళ తెలియక ఆక్రమిస్తే వారి విషయంలో సానుభూతితో ముందుకెళ్తామని చెప్పారు. హైడ్రా ఉద్దేశం ఎకరాలకు ఎకరాలు ఆక్రమించిన వారిపై కేసులు పెట్టి, ఆ భూములను స్వాధీనం చేసుకోవడమేనని ఆయన వెల్లడించారు.