- అమీన్ పూర్లో పర్మిషన్, మియాపూర్‌లో నిర్మాణం
- ప్రభుత్వ భూమిలో కట్టడంతో కూల్చేసిన హైడ్రా
మియాపూర్/అమీన్పూర్, వెలుగు: ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి మియాపూర్, అమీన్పూర్సరిహదులో నిర్మించిన ఐదంతస్తుల బిల్డింగ్‌ను హైడ్రా నేలమట్టం చేసింది. భవన నిర్మాణానికి నిర్మాణదారులు నకిలీ ఎల్ఆర్ఎస్ సృష్టించినట్లు తేలింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ సర్వే నంబర్ 337, 338లో హుడా అప్రూవ్డ్ లే అవుట్లో ప్లాట్ నంబర్ 126లోని 400 గజాల స్థలాన్ని భాను కన్స్ట్రక్షన్స్ యజమానులు ఎల్లారెడ్డి అండ్ అదర్స్ కొనుగోలు చేశారు. దీనికి ఆనుకొని శేరిలింగంపల్లి మండలం మియాపూర్‌లోని సర్వే నంబర్ 101లో ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో దాదాపు 473 గజాలను భాను కన్స్ట్రక్షన్స్ ఓనర్లు కలుపుకున్నారు.
ఈ స్థలానికి ప్లాట్ నంబర్ 126సీ, 126 డీ, 226 పార్ట్ పేర్కొంటూ 873 గజాల్లో 5 అంతస్తుల బిల్డింగ్ నిర్మాణానికి అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి పర్మిషన్ తీసుకున్నారు. పర్మిషన్ కోసం ఫేక్ ఎల్ఆర్ఎస్ సృష్టించారని, డబ్బులుచెల్లించినట్లు పొందుపర్చిన డీడీ కూడా ఫేక్ అని మున్సిపల్ అధికారులు గుర్తించారు. దీనిపై ఇప్పటికే అమీన్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది. దీనిపై హెచ్ఎండీఏ అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేసినా, నిర్మాణం కొనసాగించడంతో ఇటీవల హైడ్రాకు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ, హెచ్ఎండీఏ, మున్సిపల్ అధికారులతో కలిసి నిర్మాణాన్ని పరిశీలించారు. అక్రమ నిర్మాణంగా నిర్ధారించుకున్న తర్వాత శనివారం భారీ యంత్రాలతో కూల్చివేతలు చేపట్టారు. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు కూల్చివేతలు కొనసాగాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.
