
మేడిపల్లి, వెలుగు: ఫిర్జాదిగూడ మున్సిపాలిటీ పరిధిలోని కంచ పర్వతాపూర్ శ్మశానవాటికలో అక్రమ లేఅవుట్, నిర్మాణాలను హైడ్రా గురువారం కూల్చివేయించింది. ప్రభుత్వ భూమిలోని శ్మశానవాటికను కబ్జా చేసి, ప్లాట్లుగా మార్చి, విక్రయిస్తున్నారని వచ్చిన ఫిర్యాదులపై ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. మొత్తం 3 షాపులు, 15 ప్లాట్లలో వేసిన పునాదులు, 2 మీటర్ల ఎత్తులో నిర్మించిన ప్రహరీలను, వాటిలో వేసిన షెడ్లను తొలగించారు. అధికారుల వివరాల ప్రకారం.. పర్వతాపూర్ లోని సర్వే నంబర్12లో సుఖేందర్ రెడ్డికి సొంత భూమి ఉంది. ఇతనితోపాటు ఫిర్జాదీగూడ మాజీ మేయర్ జక్కా వెంకట్‌రెడ్డి, మాజీ కోఆప్షన్ మెంబర్జగదీశ్వర్ రెడ్డి పక్కనే ఉన్న శ్మశానవాటిక స్థలాన్ని కబ్జా చేసి, లేఅవుట్ వేశారు.
ఇదంతా కరోనా సమయంలో జరిగింది. ఇది తెలిసినా రజనీకాంత్ రెడ్డి ఇక్కడ 200 గజాల ప్లాట్ కొన్నాడు. అందులో 3 షాపులు నిర్మించి, అద్దెకు ఇచ్చారు. లేఅవుట్‌లోకి వెళ్లకుండా కోర్టు కేసులున్నాయని కబ్జాదారులు నమ్మబలికారు. మొత్తం15 ప్లాట్ల ప్రహరీలపై తప్పుడు రిట్ పిటిషన్ నంబర్లు రాయించారు. తాము అటువైపు వెళ్లకుండా అడ్డుకోవడానికే ఇలా చేశారని ప్రజావాణిలో పలువురు ఫిర్యాదులు చేశారు. గూగుల్ మ్యాప్స్, ఎన్ ఆర్ఎస్ సీ ఇమేజ్‌లు, రెవెన్యూ రికార్డుల ఆధారంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సదరు స్థలాన్ని పరిశీలించారు. రెవెన్యూ అధికారులతో మాట్లాడి, శ్మశానవాటిక స్థలమేనని నిర్ధారించుకున్నారు. ఆయన ఆదేశాలతో అధికారులు గురువారం ఉదయం ఆక్రమణలను తొలగించారు.
ఫుట్ పాత్ పై అక్రమ నిర్మాణాల తొలగింపు
మెహిదీపట్నం: ఫుట్ పాత్ లను కబ్జా చేస్తే ఊరుకునేది లేదని జీహెచ్ఎంసీ సర్కిల్–12 టౌన్ ప్లానింగ్ విభాగం శిక్షణ అధికారి సునీత హెచ్చరించారు. నాంపల్లి నియోజకవర్గంలోని ఆసిఫ్ నగర్ జిర్రా రోడ్డులో ఫుట్‌పాత్‌ను ఆక్రమించి, చేపట్టిన నిర్మాణాలను గురువారం భారీ పోలీస్ బందోబస్తు మధ్య తొలగించారు.
కాలువలో చెత్త తీయించిన హైడ్రా కమిషనర్
మలక్ పేట : చంపాపేట మారుతీనగర్వరద కాలువలోని చెత్తను హైడ్రా కమిషనర్రంగనాథ్ దగ్గరుండి తీయించారు. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి కాలువలో చెత్త పేరుకుపోయి, వరద నీరు ఇళ్లలోకి చేరడంపై స్థానికులు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన గురువారం ఉదయం అక్కడికి వెళ్లి, జేసీబీ తెప్పించి, కాలువలోని చెత్త తొలగించేలా చర్యలు తీసుకున్నారు. కాలువను
విస్తరించాల్సి ఉందని చెప్పారు.