అత్తాపూర్, రాజేంద్ర నగర్‎లో హైడ్రా కూల్చివేతలు

అత్తాపూర్, రాజేంద్ర నగర్‎లో హైడ్రా కూల్చివేతలు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అత్తాపూర్ సర్కిల్ శాస్త్రిపురంలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. కొందరు వ్యాపారులు పార్కు స్థలాన్ని కబ్జా చేసి అమ్మేశారు. ఈ విషయాన్ని స్థానికులు హైడ్రా దృష్టికి తీసుకెళ్లారు. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా సిబ్బంది బుధవారం (ఏప్రిల్ 1) ఉదయం పార్కు స్థలంలో నిర్మించిన భారీ భవనాలను నేలమట్టం చేశారు. మొత్తం 6500 గజాల స్థలాన్ని కాపాడింది హైడ్రా. కూల్చివేతల సమయంలో ఘటన స్థలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా  భారీ పోలీస్ బందోబస్తు మోహరించారు. 

రాజేంద్రనగర్ పరిధిలోని శివరాంపల్లి రాఘవేంద్ర కాలనీలో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. బుధవారం (ఏప్రిల్ 1) తెల్లవారుజూము ఆరు గంటల నుంచే కూల్చివేతలు చేపట్టింది. అక్రమంగా నిర్మిస్తున్న నాలుగు నుంచి ఐదు అంతస్తుల భవనాలను నేలమట్టం చేశారు హైడ్రా సిబ్బంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు అధికారులు.