
హైడ్రా మరోసారి కొరడా ఝుళిపించింది. హైదరాబాద్ నగరంలో ఆక్రమణలను తొలగించింది. మంగళవారం (మే 6) ఉదయం గచ్చిబౌలి ప్రాంతంలో ఆక్రమణలను తొలగించిన హైడ్రా అధికారులు.. సాయంత్రం గాజులరామారంలో అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి కట్టిన పలు కట్టడాలతో పాటు రోడ్డును కబ్జా చేసి నిర్మించిన ప్రహరీగోడలను కూల్చివేసింది. మొత్తం15 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది.
గాజులరామారంలోని సర్వే నంబరు 354లో ఉన్న ప్రభుత్వ భూమిలో కేఎల్ యూనివర్సిటీ 5 ఎకరాల భూమిని ఆక్రమించినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆ 5 ఎకరాలతో పాటు మరో 10 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2009లో ఈ భూమిని రాజీవ్ స్వగృహ నిర్మాణాలకు కేటాయించింది. అక్కడ నిర్మాణాలు రాకపోవడంతో భూమి కబ్జా చేసి షెడ్లు వేశారు స్థానిక నాయకులు. ఆక్రమణలు తొలగించి ప్రభుత్వ భూమి పేరిట బోర్డులు ఏర్పాటు చేశారు హైడ్రా అధికారులు.
ఉదయం గచ్చిబౌలిలో కూల్చివేతలు చేపట్టింది హైడ్రా.. గచ్చిబౌలిలోని అక్రమకట్టడాలను తొలగించింది హైడ్రా. స్థానిక సంధ్య కన్వెన్షన్ ప్రాంతంలోని ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హోసింగ్ సొసైటీ లే ఔట్ లో అక్రమ కట్టడాలను గుర్తించిన హైడ్రా.. లే అవుట్ లో రోడ్స్, పార్క్ లో ఆక్రమణలను తొలగించింది. అనుమతులు లేని కట్టడాలను కూల్చేసినట్లు తెలిపారు అధికారులు.
లేఅవుట్లో తమ ప్లాట్లు కనిపించకుండా నిర్మాణాలు చేపట్టారంటూ ప్లాట్ల యజమానులు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగింది హైడ్రా. ఈ క్రమంలో సంధ్య కన్వెన్షన్ మినీ హాల్ తో పాటు , కిచెన్, రెస్ట్ రూమ్ లను కూల్చేశారు హైడ్రా అధికారులు. లేఅవుట్ ను ఆక్రమించి నిర్మించిన రేకుల ఫెన్సింగ్ తొలగించారు అధికారులు.