న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో వన్దేలో టీమిండియా బ్యాటింగ్ లో తడబడింది. భారీ స్కోర్ చేయాల్సిన పిచ్ పై ఒక మాదిరి స్కోర్ కే పరిమితమైంది. బుధవారం (జనవరి 14) రాజ్ కోట్ వేదికగా నిరంజన్ షా స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో కేఎల్ రాహుల్ సెంచరీతో ఒంటరి పోరాటం చేసి టీమిండియాకు డీసెంట్ టోటల్ అందించాడు. రాహుల్ తో పాటు గిల్ (56) హాఫ్ సెంచరీతో రాణించడంతో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. రాహుల్ 112 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. న్యూజిలాండ్ బౌలర్లలో క్రిస్టియన్ క్లార్క్ మూడు వికెట్లు పడగొట్టాడు. జేడెన్ లెన్నాక్స్, కైల్ జామిసన్, జకారీ ఫౌల్క్స్, మైఖేల్ బ్రేస్‌వెల్ తలో వికెట్ తీనుకున్నారు.
ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన ఇండియా మొదట బ్యాటింగ్ కు దిగింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభమాన్ గిల్ తొలి వికెట్ కు 70 పరుగులు జోడించి శుభారంభం ఇచ్చారు. పవర్ ప్లే లో గిల్ వేగంగా పరుగులు చేసినా మరో ఎండ్ లో హిట్ మ్యాన్ పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డాడు. క్రీజ్ లో ఉన్నంత సేపు ఇబ్బందిపడిన రోహిత్ 38 బంతుల్లో కేవలం 24 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ దశలో కోహ్లీతో జత కలిసిన గిల్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 56 పరుగులు చేసి దూకుడు మీదున్న గిల్ ను ఒక షార్ట్ బాల్ వేసి పెవిలియన్ కు చేర్చాడు. కాసేపటికి ఫామ్ లో ఉన్న కోహ్లీని క్రిస్టియన్ క్లార్క్ సూపర్ డెలివరీతో ఔట్ చేశాడు.
కోహ్లీకి ముందే అయ్యర్ కూడా 8 పరుగులే చేసి ఔట్ కావడంతో ఇండియా 118 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో జట్టును ఆదుకునే బాధ్యత కేఎల్ రాహుల్, జడేజా తీసుకున్నారు. ఇద్దరూ జాగ్రత్తగా ఆడుతూ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో రాహుల్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 27 పరుగుల వద్ద జడేజా ఔట్ కావడంతో ఆ తర్వాత వచ్చిన నితీష్ కుమార్ రెడ్డితో రాహుల్ మరో భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును ముందుకు తీసుకెళ్లాడు. ఒక వైపు వికెట్లు పడినా మరో ఎండ్ లో రాహుల్ ఒంటరి పోరాటం చేస్తూ జట్టు స్కోర్ ను 284 పరుగులకు చేర్చాడు.
