హైదరాబాద్ సిటీ, వెలుగు: ఆక్రమణలు తొలగించి చెరువులను పునరుద్ధరించడం గొప్ప పరిణామమని హైడ్రాను కర్నాటక బృందం అభినందించింది. బతుకమ్మకుంట, కూకట్‌పల్లి నల్లచెరువుతో పాటు నగరంలో మొదటివిడతగా హైడ్రా పునరుద్ధరించిన పలు చెరువులను కర్నాటకలోని వివిధ విభాగాలకు చెందిన ప్రతినిధుల బృందం బుధవారం సందర్శించింది.
అనంతరం హైడ్రా ఆఫీసులో కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను కలిసి చెరువుల పునరుద్ధరణలో ఎదురైన సవాళ్లను.. వాటిని అధిగమించిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఇటీవల బెంగళూరులోని చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ జరుగుతున్న తీరును పరిశీలించిన హైడ్రా.. కొద్దిరోజుల్లోనే అక్కడి బృందం ఇక్కడకు వచ్చి చూసేలా చెరువులను పునరుద్ధరించారు. బతుకమ్మకుంటను చూశామని, ఆక్రమణలకు గురై.. నాడు ముళ్ల పొదలతో ఉన్న చిత్రాలను, వీడియోను చూశామని, ఇప్పుడు పునరుద్ధరణ చాలా బాగా చేశారని బృందం సభ్యులు అభినందించారు.
