హైదరాబాద్ సిటీ, వెలుగు: పార్కులు, ప్రభుత్వ స్థలాల కబ్జాలపై సోమవారం హైడ్రా ప్రజావాణికి 47 ఫిర్యాదులు అందాయి. హైడ్రా అడిషనల్ కమిషనర్ ఎన్.అశోక్ కుమార్ వాటిని స్వీకరించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండలం మచ్చబొల్లారం గ్రామం సర్వే నంబరు188లో 30 గుంటల ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతుందని బాలాజీ ఎన్‌క్లేవ్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పెద్ద చెరువు విస్తీర్ణం ఏటా పెరిగిపోయి ఎగువన ఉన్న తమ ప్లాట్లు మునిగిపోయాయని పలువురు ఫిర్యాదు చేశారు. గతంలో తూముల ద్వారా కిందకు నీరు వెళ్లేదని, వాటిని బంద్ చేయడంతో మురుగు, వర్షం నీరంతా చెరువులోకి చేరుతోందని పేర్కొన్నారు.
అలుగు ఎత్తును పెంచేయడంతో మరింత ఇబ్బంది తెలెత్తుతోందన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల గ్రామం తెలంగాణ హౌసింగ్ బోర్డు కాలనీలో ఖాళీ స్థలాలు మాయమవుతున్నాయని స్థానికులు ఫిర్యాదు చేశారు. పార్కుల్లో మందిరాలు కడుతున్నారని, షెడ్డులు వేసి అద్దెకు ఇస్తున్నారని ఆరోపించారు. బాగ్‌లింగంపల్లి డివిజన్ హౌసింగ్ బోర్డు కాలనీలో పిల్లల పార్కు కబ్జాకు గురైందని, పలు దుకాణాలు ఏర్పాటు చేసి వ్యాపారం చేసుకుంటున్నారని కంప్లయింట్ ఇచ్చారు.
మేడ్చల్ మల్కాజిగిరిలో 109 అర్జీలు..
మేడ్చల్ కలెక్టరేట్: మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 109 అర్జీలు వచ్చాయి. వీటిని కలెక్టర్ మనుచౌదరి స్వీకరించారు. అడిషనల్ కలెక్టర్లు రాధికగుప్తా, విజయేందర్ రెడ్డి, డీఆర్వో హరిప్రియ పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లాలో 29..
రంగారెడ్డి కలెక్టరేట్: రంగారెడ్డి కలెక్టరేట్ లో ప్రజావాణికి 29 దరఖాస్తులు వచ్చాయి. కలెక్టర్ నారాయణ రెడ్డి వాటిని పరిశీలించారు. తమకు ఐదు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదంటూ రాజీవ్ ఆరోగ్యశ్రీలో పనిచేస్తున్న ఆరోగ్య మిత్ర ఉద్యోగులు కలెక్టర్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో ఇప్పిస్తానని రెండు మూడు రోజుల్లో వారి జీతాలు ఇవ్వాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
వికారాబాద్ జిల్లాలో 65..
వికారాబాద్: వికారాబాద్ కలెక్టరేట్లో ప్రజావాణికి 65 అర్జీలు రాగా, కలెక్టర్ ప్రతీక్ జైన్ స్వీకరించారు. వాటిని సంబంధిత అధికారులకు రెఫర్ చేశారు. అడిషనల్ కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, డీఆర్వో మంగ్లీలాల్, ఆర్డివో వాసుచంద్ర పాల్గొన్నారు.
