ప్రభుత్వ భూముల ఆక్రమణదారులపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నది. ఈ ఏడాది కాలంలో ఇప్పటి వరకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో సుమారు రూ.60 వేల కోట్ల విలువైన వెయ్యి ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంది. చెరువులు, కుంటలకు కబ్జాదారుల నుంచి విముక్తి కల్పించి పునరుద్ధరిస్తున్నది.
గ్రేటర్ హైదరాబాద్ పోచారంలో అక్రమంగా నిర్మించిన ప్రహరీ గోడను అక్టోబర్ 24న హైడ్రా తొలగించి 8 ఏళ్ల సమస్యకు పరిష్కారం చూపించింది. 1978లో 27 ఎకరాల ఎకరాల్లో 400 ప్లాట్లతో జీపీ లే అవుట్ ఏర్పాటు చేయగా.. అందులో ఓ వ్యక్తి 6.18 ఎకరాల భూమిని తమదే అంటూ అక్రమంగా ప్రహరీ నిర్మించాడు. అక్రమ ప్రహరీపై సుమారు 8 ఏళ్లుగా పోరాడిన లే అవుట్ సొసైటీ.. చివరకు ప్రజావాణిలో హైడ్రాకు ఫిర్యాదు చేసింది. సొసైటీ సభ్యుల ఫిర్యాదుపై క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. అక్రమంగా నిర్మించినట్లు గుర్తించారు.దీంతో ప్రహరీ గోడను తొలగించారు హైడ్రా సిబ్బంది. 8 ఏళ్లుగా ఉన్న సమస్యకు హైడ్రాతో పరిష్కారం లభించడంతో హైడ్రా చర్యల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.
