హైదరాబాద్ ప్రగతి నగర్ చెరువుపై హైడ్రా కీలక ప్రకటన

హైదరాబాద్ ప్రగతి నగర్ చెరువుపై హైడ్రా కీలక ప్రకటన
  • ప్రగతి నగర్ ​చెరువును పరిరక్షిస్తం: హైడ్రా కమిషనర్ ​రంగనాథ్​

జీడిమెట్ల, వెలుగు: హైదరాబాద్ నగరంలో ఎక్కడా పేదల నివాసాలను హైడ్రా తొలగించబోదని కమిషనర్ ఏవీ రంగనాథ్ మరోసారి స్పష్టం చేశారు. బుధవారం గాజులరామారం సర్వే నంబర్ 307లో ఆయన క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. స్థానికులతో మాట్లాడుతూ.. ఏండ్ల తరబడి ప్రభుత్వ భూమిలో ఉంటున్న పేదల ఇండ్లను తొలగించమని భరోసా ఇచ్చారు. పేదల ఇళ్లను మినహాయించి ప్రభుత్వ భూమిని మాత్రమే కాపాడుతున్నామని తెలిపారు. కొంతమంది చేస్తున్న వదంతులను నమ్మి ఆందోళన చెందవద్దని సూచించారు.

హైడ్రా పేరుతో ఎవరైనా మోసాలకు పాల్పడితే నేరుగా హైడ్రా కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని కోరారు. అదే సమయంలో ప్రభుత్వ భూమిలో కొత్తగా ఇండ్లు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రగతినగర్ చెరువు పరిరక్షణకు ప్రజల విజ్ఞప్తుల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. 

చెరువులో చేపలు, చికెన్, మాంసాల వ్యర్థాలు డంప్ చేయడంతో దుర్వాసన సమస్య ఉందన్న ఫిర్యాదుపై సుమారు 150 లారీల వ్యర్థాలను తొలగించినట్లు తెలిపారు. ఆయన వెంట హైడ్రా అదనపు డైరెక్టర్ వర్ద పాపయ్య, ఏసీపీ ఉమామహేశ్వర్ తోపాటు హైడ్రా, జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు.