కుల్సుంపురాలో 150 కోట్ల ల్యాండ్ సేఫ్

కుల్సుంపురాలో 150 కోట్ల ల్యాండ్ సేఫ్
  •     1.30 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు తొలగించిన హైడ్రా


హైదరాబాద్ సిటీ, వెలుగు: గోషామహల్​పరిధి కుల్సుంపురాలోని స‌‌ర్వే నంబ‌‌రు 50లో ఆక్రమ‌‌ణ‌‌ల‌‌ను శుక్రవారం  హైడ్రా అధికారులు తొలగించారు. ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ హైదరాబాద్ కలెక్టర్​తో పాటు హైడ్రా ప్రజావాణిలో కూడా  స్థానికులు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ అధికారుల‌‌తో క‌‌లిసి క్షేత్రస్థాయిలో ప‌‌రిశీలించిన హైడ్రా అధికారులు ప్రభుత్వ భూమిగా నిర్ధారించారు.  

హైడ్రా క‌‌మిష‌‌న‌‌ర్ ఏవీ రంగ‌‌నాథ్‌‌ ఆదేశాలతో ఆక్రమ‌‌ణ‌‌ల‌‌ను శుక్రవారం తొల‌‌గించారు. దాదాపు రూ.150 కోట్ల విలువైన 1.30 ఎక‌‌రాల ఈ ప్రభుత్వ భూమిని అశోక్ సింగ్‌‌ ఆక్రమించి  షెడ్డులు వేసి విగ్రహ‌‌ల త‌‌యారీదారుల‌‌కు అద్దెకు ఇచ్చాడు.  ఇక్కడ పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అధికారులు తెలిపారు.   త‌‌న భూమిగా పేర్కొంటూ సిటీ సివిల్ కోర్టును  అశోక్ సింగ్‌‌ ఆశ్రయించారు.  ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడంతో  చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే రెండు సార్లు ఆక్రమ‌‌ణ‌‌ల‌‌ను రెవెన్యూ అధికారులు తొలగించినప్పటికీ అశోక్ సింగ్‌‌ వినకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నారు. అశోక్ సింగ్‌‌పై  లంగ‌‌ర్‌‌హౌస్‌‌, మంగ‌‌ళ‌‌హాట్‌‌, శాహినాయ‌‌త్‌‌గంజ్ పోలీసు స్టేష‌‌న్లలో అశోక్ సింగ్‌‌పై 8కి పైగా  కేసులు ఉన్నట్లు కమిషనర్ రంగనాథ్ తెలిపారు.