- తనిఖీలకు హైడ్రా చీఫ్ ఆదేశం
- బల్దియా, కరెంట్, ఫైర్శాఖలతో సమావేశం
- 9000113667కు ఫిర్యాదు చేయాలని సూచన
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఫైర్ సేఫ్టీ లేకుంటే షాపు సీజ్ చేసి కరెంట్ కనెక్షన్ కట్ చేయించి నోటీసులు అంటించాలని హైడ్రా నిర్ణయించింది. నగరంలో వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతుండడంతో జీహెచ్ఎంసీ, ఫైర్, విద్యుత్ విభాగాల అధికారులతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ బుధవారం హైడ్రా ఆఫీసులో మీటింగ్పెట్టారు. షాపింగ్‌కాంప్లెక్స్‌లు, ఫర్నిచర్, బట్టల షాపులు ఇలా దేన్నీ వదలకుండా అన్ని చోట్ల తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. ఫైర్ సేఫ్టీ పాటించకపోతే షాపులను సీజ్ చేయాలని నిర్ణయించారు.
వారికి కరెంట్సరఫరా బంద్ చేయాలని, ఫైర్ సేఫ్టీ లేని షాపుగా పేర్కొంటూ నోటీసులు అతికించాలని సూచించారు. సెల్లార్ లు కచ్చితంగా పార్కింగ్ కోసమే వినియోగించాలని, వ్యాపారాలు చేస్తున్న వారు మెట్లపై, కారిడార్‌లో, సెల్లార్లలో స్టోరేజీ ఉంచొద్దన్నారు. సెల్లార్లలో ఉండడానికి రూమ్స్ఇవ్వొద్దని, వర్కర్లు, వాచ్ మెన్కుటుంబాలను ఉంచొద్దన్నారు. అగ్ని ప్రమాదం జరిగితే స్ప్రింక్లర్లు ఆన్అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.
సమాచారం ఇవ్వండి
అగ్ని ప్రమాదానికి జరిగే అవకాశాలున్న ప్రాంతాలుంటే హైడ్రా కంట్రోల్ రూమ్ నంబరు 9000113667 కు ఫోన్ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రమాదానికి అవకాశం ఉన్న పరిస్థితులుంటే అక్కడి లొకేషన్‌తో పాటు వీడియోలు, ఫొటోలు పంపించాలని కోరారు. సమాచారం ఇచ్చినవారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. నెలకు మూడు చొప్పున ఘటనలు జరుగుతున్నాయమన్నారు.
