
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రా ఆఫీస్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 54 ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదులను హైడ్రా ఫైర్ విభాగం అడిషనల్ డైరెక్టర్ శ్రీవర్ల పాపయ్య స్వీకరించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గుడ్ల పోచంపల్లి మున్సిపాలిటీలోని సర్వే నంబరు 136లో 23 గుంటల ప్రభుత్వ స్థలం కబ్జా అయ్యిందని స్థానికులు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ స్థలంలోకి వచ్చి గోడ నిర్మించడంతో పాటు భవన నిర్మాణానికి పిల్లర్లు కూడా వేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఉప్పల్ మండలం కొత్తపేట విలేజ్ గాయత్రీపురం కాలనీతో పాటు మరో ఐదు కాలనీల్లో ప్రజావసరాలకు ఉద్దేశించిన 3.12 ఎకరాల భూమి కబ్జా అయ్యిందంటూ ఆయా కాలనీవాసులు ఫిర్యాదు చేశారు. అలాగే ఫతుల్‌గూడలో తన ప్రైవేటు ల్యాండ్‌కు సంబంధించిన సర్వే నంబరు 1, 65 లను వాడుకుని పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మరొకరు ఫిర్యాదు చేశారు.
అలాగే కీసర మండలం, నాగారం మున్సిపాలిటీలోని జాలుబాయి కుంటలో 7 ఎకరాల స్థలం కబ్జాకు గురవుతోందని ఫిర్యాదు వచ్చింది. రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ మీదుగా హుస్సేన్ సాగర్‌కు వరద నీటిని తీసుకెళ్లే బుల్కాపూర్ నాలా 55 కిలోమీటర్ల మేర నామరూపాలు లేకుండా కబ్జాకు గురయ్యిందని, ఈ నాలా సజీవంగా ఉంటే 55 కిలోమీటర్ల మేర కాలనీల్లో వరదనీటి ఇబ్బందులు ఉండదని హైడ్రాకు పుప్పాలగూడ పరిసర ప్రజలు ఫిర్యాదు చేశారు.