
హైదరాబాద్ మహా నగరాన్ని దాటి విశ్వనగరంగా ఆవిర్భవించింది. అయితే, వానాకాలం వచ్చిందంటే, చినుకు పడితే చిత్తడయిపోయే నగర వీధుల్ని తలుచుకుంటేనే ఇక్కడ నివసించే ప్రజలకు కంటిమీద కునుకురాదు. ఇక్కడా అక్కడా అని కాదు దాదాపు సగం హైదరాబాద్ వరద ముంపులో మునిగిపోయేది. మరీ ముఖ్యంగా మూసీ పరీవాహకంలోని ఎన్నో ప్రాంతాలు రోజుల తరబడి ఆ నీటిలోనే మునిగిపోయేవి. మలక్‌పేట్, చంపాపేట్, మారుతీనగర్ కాలనీ, సైదాబాద్, కృష్ణానగర్ కాలనీ, బతుకమ్మ కుంట, మాదాపూర్, తమ్మిడి కుంట ఇంకా సున్నం చెరువువంటి ప్రాంతాల్లోనైతే వరద పోయిన వారాల తరబడి మొదటి అంతస్తు మొత్తం నీట మునిగి ఉండి నగరవాసికి నరకాన్ని చూపించేవి.
ఈ బాధను అనుభవించిన వారికి తెలుసు ఆ వేదనాభరితమైన రోజులు గుర్తుకొస్తే ఇప్పటికీ గజగజ వణికిపోతారు. ఏడాదంతా కష్టపడి సంపాదించుకొని ఇంట్లో దాచుకున్నదంతా వరదలలో ఊడ్చిపెట్టుకుపోతే... జరిగే ఆస్తి నష్టం ఒక బాధైతే... ఆ వరదలు తగ్గిన తర్వాత వచ్చే రోగాలతో ఒళ్లు గుల్లయి పడే బాధ మరోటి.
శాశ్వత పరిష్కారమే సీఎం ఆలోచన
సామాన్య కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక మన హైదరాబాద్‌కు సమూల మార్పులు చేయాలని సంకల్పించాడు సీఎం రేవంత్ రెడ్డి. ముంపు సమస్యను అధిగమిస్తేనే నిజమైన విశ్వనగరంగా హైదరాబాద్ భాసిల్లుతుందనే నిజాన్ని నిరూపించాలనుకున్నాడు. గత పాలకుల ప్రచార ఆర్భాటంలా కాకుండా, ఏదో సమస్యకు పైపై పూతలా తాత్కాలిక ఉపశమనం కలిగించడం కాకుండా సమస్య మూలాలను శోధించి కూకటివేళ్లతో పెకిలించి వేయాలని దృఢనిశ్చయం తీసుకున్నాడు. అందుకే హైడ్రా వ్యవస్థకు ఊపిరి పోశాడు.
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఎజెన్సీ (హైడ్రా) ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల్లోంచి పురుడుపోసుకుంది. రేపటి అందమైన హైదరాబాద్ ను కాంక్షిస్తూ రూపుదిద్దుకుంది. 2018లో 625 స్క్వేర్ కిలోమీటర్ల పరిధితో జీహెచ్ఎంసీలో అంతర్భాగంగా ఏర్పాటైన ఈవీడీఎంకు సంపూర్ణమైన స్వతంత్ర ప్రతిపత్తి హోదానిచ్చి 2050 స్క్వేర్ కిలోమీటర్లకు పైగా పరిధితో ఔటరుకు అటూ ఇటుగా పబ్లిక్ అసెట్స్ ఐన చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు, లేఔట్లలో మౌలిక వసతులకు వదిలిన స్థలాలు వంటివాటిని పర్యవేక్షిస్తూ కాపాడే వ్యవస్థ హైడ్రా.
హైడ్రాకు స్వేచ్ఛ
2012 బిల్డింగ్ రూల్స్ ఎఫ్టిఎల్ పరిధిలో, బఫర్ జోన్లలో ఎలాంటి నిర్మాణాలు చేయకూడదని క్రిస్టల్ క్లియర్‌గా చెప్పాయి. ఐతే గత కొన్నేళ్లుగా ఈ స్థలాల్లో నిర్మిత మవుతున్న ప్రతి అక్రమ కట్టడాన్ని చిన్నా, పెద్దా తేడా లేకుండా అరికట్టి, చెరువులకు పునర్వైభవం తేవడం తన మొదటి ప్రాధాన్యంగా హైడ్రా తన పనిని ప్రారంభించింది. దీనికి అంకురార్పణ చేసినప్పుడే దురాక్రమణదారులైన బడాబాబుల నుంచి, స్వ, పర పక్షాల నుంచి వచ్చే ఒత్తిళ్లను సైతం అంచనా వేసి ఐజీ స్థాయి అధికారి కమిషనర్‌గా, స్వయంగా సీఏంనే చైర్మన్‌గా ఎలాంటి అవాంతరాలకు లొంగని స్వేచ్ఛను హైడ్రాకు అందించారు సీఎం రేవంత్ రెడ్డి.
లోటస్ పాండ్‌లో అక్రమంగా నిర్మించిన ప్రహారీని జూన్ 27న కూల్చేయడంతో మొదలుపెట్టిన తన పనిని ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా, ఏ పక్షం అనే పక్షపాతం లేకుండా నిర్వహిస్తోంది హైడ్రా. అసలు ముంపు సమస్యకు, వరదలకు ప్రధాన కారణం నాలాల ఆక్రమణలు, చెరువుల కబ్జాలు, డ్రైన్ల పూడికలు అని నిర్ధారించిన హైడ్రా, తన పరిధిలో మొత్తం 350కి పైగా ముంపు ప్రాంతాలను గుర్తించింది. అందులోని 140కి పైగా హై రిస్క్ జోన్లలో పర్మినెంట్ సొల్యూషన్లకు ప్రణాళికలు రచించింది.
ప్రజాప్రభుత్వం పటిష్ట ప్రణాళిక
డ్రైన్ల విస్తరణ మొదలు క్యాచ్మెంట్ ఏరియా మ్యాపింగ్, వాటర్ ఫ్రీ ఫ్లో కోసం లేక్ డెసిల్టింగ్, అంతిమంగా మూసీ ద్వారా ఆ వరద నగరాన్ని దాటేలా పటిష్ట ప్రణాళికను అమలు చేస్తున్నారు. ఇందుకోసం చెరువుల బఫర్, ఎప్టీఎల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను కూల్చడం, డ్రైన్లను వెడల్పు చేయడం, వంటివి ఎప్పటికప్పుడు చేయడం ద్వారా 2024 జులైలో ఏర్పడిన హైడ్రా కేవలం సంవత్సరం కాలంలోనే మారుతీనగర్‌కు, కృష్ణానగర్, బతుకమ్మ కుంట, సున్నం చెరువు ఇంకా పైన చెప్పిన ప్రధాన ముంపు ఏరియాల్లో నేడు ఇంత వర్షం కురుస్తున్నా వరద ఉధృతంగా ఉన్నా... నీటికి సరైన దారిని చూపి ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించింది తెలంగాణ ప్రజా ప్రభుత్వం. ఇందుకు ప్రస్తుత పాలకుల చిత్తశుద్ధే ప్రధాన కారణం. గత ఏడు వరదల సమయంలో క్షేత్ర స్థాయిలో రెండ్రోజులు పర్యటించిన ముఖ్యమంత్రి, మున్నేరు వరద బాధితులకు, హైదరాబాద్ ముంపు బాధితులకు ఇచ్చిన కొండంత భరోసా వారికి
ధైర్యాన్ని అందించింది.
బీఆర్ఎస్ గోబెల్స్ ప్రచారం
హైడ్రా ద్వారా రియల్ ఎస్టేట్ పడిపోయిందని, పేదలకు అన్యాయం జరిగిందని నాటకాలు ఆడుకుంటూ బీఆర్ఎస్ నేతలు గోబెల్స్ ప్రచారం చేశారు. కానీ, కోటిన్నర మంది నగరవాసుల సంక్షేమమే ముఖ్యమని నమ్మిన రేవంతన్న అభాగ్యులకు అండగా నిలుస్తూ.. ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన ఏకైక ముఖ్యమంత్రిగా నగర చరిత్రలో నిలిచారు.
ఫాంహౌసులో ఉంటూ ప్రజాసంబంధాలకు ఎగనామం పెట్టిన మాజీ సీఎంకు, పనే పరమావధిగా, ప్రజల సుఖశాంతులే అంతిమ లక్ష్యంగా పనిచేసే నేటి సీఎం రేవంతన్నకు మధ్య ఉన్న ప్రధాన తేడా ఇదే. ఆగస్టు 13 నుంచి 15 వరకూ రాబోయే వైపరీత్యానికి తనతో సహా ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం సిద్ధం చేసి ఒక్క ప్రాణనష్టం లేకుండా, ఆస్తి నష్టం కాకుండా కాపాడే భరోసాను ఇచ్చాడు రేవంతన్న. నేటి ప్రకృతి విలయానికి హైడ్రాను అడ్డుపెట్టాడు. విశ్వ నగరంగా హైదరాబాద్‌ను నిలిపి అంతర్జాతీయ పెట్టుబడుల్ని సాధించి, ఇటు ముంపు సమస్య ను పారదోలుతూ నగర భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న సీఎం రేవంత్ అభినందనీయుడు.
- పున్నా కైలాస్ నేత,జనరల్ సెక్రటరీ, టీపీసీసీ-