హైదరాబాద్ సిటీ, వెలుగు: కుత్బుల్లాపూర్ భాగ్యలక్ష్మి కాలనీ, గుడిమల్కాపూర్ ప్రాంతాల్లో ఆక్రమణకు గురైన పార్కు స్థలాలను హైడ్రా అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. 80 ఎకరాల్లోని భాగ్యలక్ష్మి కాలనీ లేఅవుట్లో దశాబ్దాలుగా ఆక్రమణలో ఉన్న 6 పార్కులకు సంబంధించి 2,260 గజాల స్థలాన్ని కాపాడి ఫెన్సింగ్ వేశారు. అలాగే, గుడిమల్కాపూర్లోని ఏజీ ఆఫీస్ హౌసింగ్ సొసైటీలో కబ్జాకు గురైన 1,452 గజాల పార్కు స్థలాన్ని వ్యాపారుల నుంచి విముక్తి చేశారు. మొత్తం 3,712 గజాల విస్తీర్ణం కలిగిన ఈ స్థలాల విలువ సుమారు రూ. 37.12 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. 'హైడ్రా ప్రజావాణి'లో వచ్చిన ఫిర్యాదులపై కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టారు.
