V6 News

4 ఎకరాలను కాపాడిన హైడ్రా..నాచారంలో కబ్జా చెర నుంచి తెలంగాణ ఆగ్రోస్ ఇండస్ట్రీస్ భూములకు విముక్తి

4 ఎకరాలను కాపాడిన హైడ్రా..నాచారంలో కబ్జా చెర నుంచి తెలంగాణ ఆగ్రోస్ ఇండస్ట్రీస్  భూములకు విముక్తి
  • ఆక్రమణలను కూల్చి ఫెన్సింగ్  ఏర్పాటు
  • పోచారం సర్కిల్​లో ప్రహరీ కూల్చివేత

హైదరాబాద్ సిటీ, వెలుగు:  మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా నాచారంలోని తెలంగాణ ఆగ్రోస్  ఇండస్ట్రీస్  డెవలప్ మెంట్  కార్పొరేషన్  భూములను సోమవారం హైడ్రా కాపాడింది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో సర్వే నంబరు 29/1, 30 లో 23.28 ఎకరాలను తెలంగాణ ఆగ్రోస్ కు కేటాయించింది. అయితే ఈ భూమికి ఆనుకుని ఉన్న దుర్గానగర్, కమలాబాయ్ నగర్, బాబానగర్  కాలనీల వైపు కొంతమేర ఆక్రమణలు జరిగాయి. 

ఇలా ఇప్పటికే 4 ఎకరాల భూమి కబ్జాకు గురయ్యింది. ఇలా వరుసగా కబ్జాలు జరుగుతున్నాయని, వెంటనే కబ్జాలను తొలగించి ఆగ్రోస్  భూమిని కాపాడాలని తెలంగాణ ఆగ్రోస్ సంస్థ చైర్మన్  కాసుల బాలరాజు.. హైడ్రాకు ఫిర్యాదు చేశారు. హైడ్రా కమిషనర్  ఏవీ రంగనాథ్  ఆదేశాల మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇప్పటికే ఇండ్లు  కట్టుకుని నివాసం ఉన్న వాటిని మినహాయించారు. వాటి జోలికి వెళ్లకుండా ప్రీకాస్ట్ ఇటుకలతో ప్రహరీ నిర్మించి అందులో వేసిన చిన్న షెడ్లను తొలగించారు.

సేకరించిన చెత్తను వేరు చేసేందుకు వినియోగిస్తున్న షెడ్లను, స్క్రాప్  దుకాణాన్ని ఖాళీ చేయించి తొలగించారు. ఇక్కడ లావణ్య అనే మహిళ తప్పుడు పత్రాలతో రెండు ఎకరాలకుపైగా చిన్న ప్లాట్లుగా చేసి అమ్మేయగా.. తెలంగాణ ఆగ్రోస్  సిబ్బంది ఆమెపై నాచారం పోలీసు స్టేషన్ లో కేసులు పెట్టారు. తెలంగాణ ఆగ్రోస్ లోనే పని చేస్తున్న ఉద్యోగి రాజు అనే వ్యక్తితో కలిసి 1200 గజాల ఆక్రమణలో భాగస్వామ్యం అయినట్టు ఆ సంస్థ అధికారులు తెలిపారు. 

అలాగే, మహేందర్ అనే వ్యక్తి 2 వేల గజాలకు పైగా ఆక్రమించి ప్లాట్లుగా చేశాడు. ప్రస్తుతానికి చిన్న షెడ్లు వేసి వాటిని కిరాయికి ఇచ్చాడని ఆగ్రోస్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆగ్రోస్ కు  చెందిన భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్  వేసింది. మల్లాపూర్  డివిజన్ లో ఎక్కడా నివాసాల జోలికి వెళ్లలేదని హైడ్రా స్పష్టం చేసింది.

కొర్రెములలో..

ఘట్​కేసర్: ఘట్​కేసర్ మండలం పోచారం సర్కిల్ పరిధిలోని కొర్రెములలో పార్కు స్థలం కబ్జా చేసి నిర్మించిన ప్రహరీని హైడ్రా అధికారులు కూల్చేశారు. సర్వే నంబర్ 747, 750లో ఉన్న 1,034 గజాల పార్కు స్థలాన్ని అక్రమార్కులు కబ్జా చేసి ప్రహరీ నిర్మించగా గతంలో హైడ్రా అధికారులు కూల్చివేశారు. తిరిగి మళ్లీ నిర్మాణాలు చేపట్టడంతో స్థానికుల కంప్లయింట్​ ఇచ్చారు. దీంతో హైడ్రా అధికారులు మరోసారి సోమవారం కూల్చివేతలు చేపట్టారు. అక్రమ నిర్మాణాలు చేపడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.