- మైత్రీవనం వద్ద మానవహారం
- పోచారం మున్సిపాలిటీలోనూ భారీ ర్యాలీ
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రాకు జనం నుంచి రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. హైడ్రా చర్యలను ప్రశంసిస్తూ బుధవారం ర్యాలీలు, ప్లకార్డుల ప్రదర్శన, అభినందన సమావేశాలు నిర్వహించగా, గురువారం కూడా మద్దతు ర్యాలీలు కొనసాగాయి. అమీర్ పేటలో వరద ముప్పు తప్పించారంటూ.. అమీర్ పేట్, శ్రీనివాస్ నగర్, గాయత్రినగర్, కృష్ణ నగర్, అంబేద్కర్ నగర్ కాలనీల ప్రతినిధులు మైత్రీవనం వద్ద ప్లకార్డులు ప్రదర్శించి హైడ్రాకు సంఘీభావం తెలిపారు. ఐదు సెంటీమీటర్ల వర్షం పడితే అతలాకుతలమైన తమ కాలనీలకు వరద ముప్పు తప్పించారంటూ హైడ్రాను కొనియాడారు.
ప్యాట్నీ నాలా వద్ద ర్యాలీ...
ప్యాట్నీ నాలాను విస్తరించి పైన ఉన్న కాలనీలకు వరద ముప్పు తప్పించిన హైడ్రాకు అక్కడి వారు కృతజ్ఞతలు తెలిపారు. కాలనీల నుంచి ర్యాలీగా వచ్చి మాట్లాడారు. ఒకప్పుడు వర్షం వస్తే ప్యాట్నీ, విమాన్‌నగర్, బీహెచ్ఈఎల్, ఇందిరమ్మ నగర్ కాలనీల్లోని ఇండ్లలోకి నీళ్లు వచ్చేవని, ఈ ఏడాది ఈ సమస్యలు ఎదురు కాలేదని చెప్పారు. ప్యాట్నీ వద్ద 15 నుంచి 18 అడుగులకు కుంచించుకు పోయిన నాలాను విస్తరించడంతో 30 ఏండ్లుగా ఉన్న సమస్య పరిష్కారమైందన్నారు.
పోచారం మున్సిపాలిటీలోనూ...
పోచారం మున్సిపాలిటీలోని దివ్యానగర్ లేఔట్‌లోని 2,218 మంది ప్లాట్ల యజమానులు హైడ్రాకు ధన్యవాదాలు తెలిపారు. తమ ప్లాట్లు తమకు వచ్చేలా చేసిన హైడ్రాకు కృతజ్ఞతగా ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. ఈ ఏడాది జనవరి 25న దాదాపు 200 ఎకరాల్లో 2218 ప్లాట్లుగా విస్తరించిన దివ్య లేఔట్ చుట్టూ 4 కిలోమీటర్ల మేర నిర్మించిన ప్రహరీని హైడ్రా తొలగించి న్యాయం చేసిందన్నారు. భారీ ప్రహరీని కూల్చి వేయడంతో ఎన్నో నివాస ప్రాంతాలకు దారి దొరికిందన్నారు.
