
హైదరాబాద్ లోని యాకత్ పురాలో గురువారం ( సెప్టెంబర్ 11 ) ఓ చిన్నారి తెరిచి ఉన్న మ్యాన్ హోల్ లో పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు పారిశుధ్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఘటనపై వివరణ ఇచ్చారు. మ్యాన్ హోల్ ఘటనపై విచారణ చేపట్టామని.. ఈ ఘటనకు పూర్తి బాధ్యత హైడ్రాదేనని అన్నారు. ఈ ఘటనకు మాన్ సూన్ ఎమర్జెన్సీ టీమ్ ఇంచార్జి నిర్లక్ష్యం కారణమని... బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు కమిషనర్ రంగనాథ్.
మ్యాన్ హోల్ మూతలు మూసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు రంగనాథ్. యాకుత్‌పురాలో డ్రైనేజీ మూతను తెరిచి ఉంచడంతో ఒక చిన్నారి స్కూల్‌కు వెళ్తూ డ్రైనేజీలో పడిపోయింది. అయితే.. ఆ పాప తల్లి, స్థానికులు వెంటనే గమనించి మ్యాన్ హోల్లో పడిన ఆ పాపను రక్షించడంతో ప్రమాదం తప్పింది. మ్యాన్ హోల్ను తెరిచి ఉంచిన వారిపై బాధితులు మండిపడ్డారు.
ఏ ప్రమాదం జరగలేదు కాబట్టి సరిపోయింది గానీ పొరపాటున పాపకు ఏదైనా జరిగి ఉంటే పరిస్థితి ఏంటని నిలదీశారు. మ్యాన్హోల్మూత తెరిస్తే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని, నిందితులకు జరిమానాతో పాటు కొన్ని సార్లు జైలు శిక్ష కూడా పడుతుందని వాటర్‌బోర్డు అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. అయినా సరే.. సిటీలో కొన్ని చోట్ల ఇలా మ్యాన్ హోల్ మూతలు తెరిచే ఉంచుతుండటం గమనార్హం