గచ్చిబౌలి, వెలుగు: హైటెక్సిటీలో అత్యంత విలువైన పార్కు స్థలాన్ని హైడ్రా కాపాడింది. శేరిలింగంపల్లి మండలం కొండాపూర్లోని రాఘవేంద్ర కాలనీలో పార్కుతో పాటు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 2 వేల గజాల స్థలం లేఅవుట్లో ఉంది. పార్కు స్థలం ఖాళీగా ఉండడంతో కొంతమంది కబ్జాదారులు బైనంబర్లు సృష్టించి10 ప్లాట్లు చేసి, ప్రతిదాంట్లో ఒక్కో షెడ్డు నిర్మించారు. దీనిపై రాఘవేంద్ర కాలనీ సీ బ్లాక్ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో.. అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి కబ్జా జరిగినట్లు గుర్తించారు.
అనంతరం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ఆదేశాలతో శుక్రవారం పార్కు స్థలంలో వెలసిన అక్రమణలను హైడ్రా సిబ్బంది జేసీబీలతో తొలగించారు. స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసి పార్కు స్థలంగా పేర్కొంటూ బోర్డు ఏర్పాటు చేశారు. ఈ పార్కు స్థలం విలువ దాదాపు రూ. 30 కోట్ల వరకూ ఉంటుందని అంచనా.
200 గజాల చొప్పున 10 ప్లాట్లుగా బై నంబర్లు సృష్టించి కబ్జా చేయడమే కాకుండా కబ్జాదారులు వాటిని రెగ్యులరైజ్ కూడా చేసుకున్నారు. భవన నిర్మాణానికి అనుమతులు కూడా మంజూరయ్యాయి. ఇంతలో హైకోర్టు ఆదేశాలతో భవన నిర్మాణ అనుమతులను జీహెచ్ఎంసీ వెనక్కి తీసుకోవడం, అదే విధంగా రెగ్యులరైజేషన్ను కూడా రద్దు చేసింది.
