హైదరాబాద్ సిటీ, వెలుగు: మేడ్చల్ -–- మల్కాజిగిరి జిల్లా ఓల్డ్ ఆల్వాల్ జొన్నబండలోని ఎంహెచ్ఆర్ కాలనీలో పార్కును హైడ్రా కాపాడింది. గురువారం 1,444 గజాల పార్కు స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసింది. లే ఔట్ ప్రకారం సర్వే నంబర్లు 575, 576(పార్ట్), 577, 578(పార్ట్), 598, 580(పార్ట్)లో మొత్తం 1444.40 గజాల స్థలాన్ని పార్కు కోసం కేటాయించారు.
దీనిని ఆక్రమించేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పార్కు స్థలంగా నిర్ధారించి ఆధీనంలోకి తీసుకున్నారు.
