కూకట్ పల్లి, కోకాపేటలో గేటెడ్ కమ్యూనిటీలు ఆక్రమించిన స్థలాలపై హైడ్రా ఆపరేషన్

కూకట్ పల్లి, కోకాపేటలో గేటెడ్ కమ్యూనిటీలు ఆక్రమించిన స్థలాలపై హైడ్రా ఆపరేషన్

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యంత ఖరీదైన ఏరియా అంటే కోకాపేట్. అక్కడ ఒక్క ఎకరా వందల కోట్లు పలుకుతోంది. అలాంటి ఏరియాలో చెరువులు, రహదారుల స్థలాలను కబ్జా కోరల నుంచి విడిపించింది హైడ్రా. 2026 మే 26న చేపట్టిన భారీ ఆపరేషన్ లో భాగంగా.. కోకాపేట్ తో పాటు కూకట్ పల్లి ఏరియాలోని గేటెడ్ కమ్యూనిటీ విల్లా ముందు కబ్జాకు గురైన విలువలైన స్థలాలను స్వాధీనం చేసుకుంది. ఈ భారీ ఆపరేషన్ కు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 

రంగారెడ్డి జిల్లా గండిపేట మండ‌లం, కోకాపేట విలేజ్‌లోని కొత్త చెరువు ఆక్రమ‌ణ‌ల‌ను హైడ్రా తొల‌గించింది. ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో దాదాపు 1.20 ఎక‌రాల వ‌ర‌కూ ఆక్రమించి గోల్డ్‌ ఫిష్ విల్లాస్ కోసం ప్లే ఏరియాలు, పార్కుల నిర్మించినట్లు గుర్తించింది. చెరువులో మ‌రో 20 ఎక‌రాల మేర ప‌లు నిర్మాణ సంస్థల ఆక్రమ‌ణ‌లు ఉన్నట్లు నిర్ధారించింది. చెరువు భూములకు ఫెన్సింగ్ ఏర్పాటు చేసి క‌బ్జా చేశారు పలు నిర్మాణ సంస్థల ప్రతినిధులు.

వందల కోట్ల విలువైన భూములు కబ్జాకు గురికావడంతో.. హైడ్రాకు స్థానికుల నుంచి పెద్దయెత్తున ఫిర్యాదులు అందాయి. క్షేత్రస్థాయిలో సంబంధిత శాఖ‌ల‌తో క‌లిసి ప‌రిశీలించిన హైడ్రా.. యాక్షన్ తీసుకుంది.  కోకాపేట కొత్త చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధి మొత్తం 72 ఎక‌రాలు. ఇందులో 22 ఎక‌రాల వ‌ర‌కూ ఆక్రమ‌ణ‌లు జ‌రిగిన‌ట్టు గుర్తించారు హైడ్రా అధికారులు.

 ఆక్రమ‌ణ‌ల‌ను నిర్ధారించుకున్నాక మంగ‌ళ‌వారం (మే 26) రంగంలోకి దిగిన హైడ్రా.. చెరువు ఎప్‌టీఎల్ ప‌రిధిలో ఆక్రమ‌ణ‌ల‌ను తొల‌గించింది. ఫెన్సింగ్‌ల‌తో పాటు.. రేకులతో ఏర్పాటు చేసిన ప్రహ‌రీల‌ను తొల‌గించారు.  చెరువు హ‌ద్దులు నిర్ధారించి ఫెన్సింగ్ వేశారు. 

ALSO READ : హైదరాబాద్ లో ORR దగ్గర  అగ్నిప్రమాదం..

  • కూకట్ పల్లి జువెల్ హైట్స్ గేటెడ్ కమ్యూనిటీ ముందు:

మరోవైపు కూక‌ట్‌ప‌ల్లి మండ‌లం ఖైత‌లాపూర్‌లో ర‌హ‌దారి ఆక్రమ‌ణ‌ల‌ను తొల‌గించారు హైడ్రా అధికారులు.  జ్యువ‌ల్ హైట్స్ గేటెడ్ క‌మ్యూనిటీ ముందు 1700 గ‌జాల మేర ర‌హ‌దారి ఆక్రమ‌ణ‌లు జరిగినట్లు స్థానికులు ఫిర్యాదు చేశారు. నిర్మాణ సంస్థకు చెందిన ఆఫీస్ రూంతో పాటు వెనుక వైపు నిర్మించిన ప‌శువుల షెడ్డును తొల‌గించారు. పశువుల షెడ్డు తొలగించేందుకు ఇప్పటికే కొంత సమయం ఇచ్చారు అధికారులు. గడువు ప్రకారం పశువుల షెడ్డును కూడా తొలగించారు. హైడ్రా చర్యలపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.