హైదరాబాద్ నగరం నలువైపులా హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. అక్రమ కట్టడాలు, చెరువుల కబ్జాలే లక్ష్యంగా హైడ్రా అధికారులు మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ భూములను, చెరువులను కబళిస్తున్న రియల్ ఎస్టేట్ గ్యాంగులకు చెక్ పెడుతూ.. భారీ స్థాయిలో ఆక్రమణలను తొలగిస్తున్నారు.
మంచిరేవుల నాగిరెడ్డి కుంట చెరువు వద్ద రియల్ ఎస్టేట్ సంస్థల అక్రమాలకు హైడ్రా బ్రేక్ వేసింది. టిన్ షీట్లతో కప్పి, చెరువునే మాయం చేసేందుకు కుట్ర పన్నగా.. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు ఆ కబ్జాలను ధ్వంసం చేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో చెరువు చుట్టూ ఫెన్సింగ్ వేసి, హైడ్రా బోర్డులను ఏర్పాటు చేసి ప్రభుత్వ స్వాధీనంలోకి తీసుకున్నారు.
అటు గండిమైసమ్మ- మియాపూర్ ప్రధాన రహదారిపై ట్రాఫిక్ కష్టాలకు హైడ్రా పరిష్కారం చూపింది. 150 ఫీట్ల రోడ్డును ఆక్రమించి వెలిసిన 10 అక్రమ షాపులను జేసీబీలతో నేలమట్టం చేశారు. గత రెండు నెలల ముందే నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఫలితంగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పడింది.
అటు అవుషాపూర్‌లోనూ హైడ్రా తన ప్రతాపం చూపింది. లేఅవుట్‌లో పార్కు కోసం కేటాయించిన 1440 గజాల ఖరీదైన స్థలాన్ని ప్లాట్లుగా మార్చి విక్రయించే ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఆక్రమణలను తొలగించి పార్కు స్థలానికి ఫెన్సింగ్ వేసి పదిలం చేశారు. పబ్లిక్ ప్రాపర్టీని కాపాడటంలో రాజీ పడే ప్రసక్తే లేదని అధికారులు హెచ్చరిస్తున్నారు.
