హైదరాబాద్ వ్యాప్తంగా అతి భారీ వర్షం..కాలనీలన్నీ జలమయం

 హైదరాబాద్ వ్యాప్తంగా అతి భారీ వర్షం..కాలనీలన్నీ జలమయం

అతి భారీ వర్షం వల్ల హైదరాబాద్ అతలాకుతలం అయింది. అర్థరాత్రి నుంచి మొదలైన బీభత్సమైన వాన..భాగ్యనగరాన్ని నీటముంచింది. హైదరాబాద్ మొత్తం కుండపోత వర్షం కుమ్మేసింది. అర్ధరాత్రి నుంచి నాన్ స్టాప్ వానతో హైదరాబాద్‌లో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. భారీ వరదలతో రోడ్లన్నీ నీటమునిగాయి. కాలనీలు చెరువులుగా మారాయి. బస్తీలు జలదిగ్భంధం అయ్యాయి. కొన్ని వాహనాలైతే వరదల ధాటికి కొట్టుకుపోతున్నాయి.

బయటకు రావొద్దు..

మరో గంటలో భారీ నుంచి అతి భారీవర్షం కురుస్తుందని హెచ్చరించింది. మరో మూడు గంటల పాటు భారీ వర్షం కొనసాగవచ్చని తెలిపింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో  డీఆర్‌ఎఫ్‌ బృందాలను జీహెచ్‌ఎంసీ అప్రమత్తం చేసింది.  అత్యవసరమైతేనే బయటకు రావాలని నగర వాసులను అధికారులు సూచించారు.

హైదరాబాద్ సిటీ అంతా వాన దంచికొడుతోంది. అమీర్‌పేట, ఖైరతాబాద్‌, సికింద్రాబాద్‌, బేగంపేట, మారేడుపల్లి,  సోమాజిగూడ, ఎల్‌బీనగర్‌, సాగర్‌ రింగ్‌రోడ్‌, హస్తినాపురం,జీడిమెట్ల, నిజాంపేట, కూకట్‌పల్లి, ప్రగతినగర్‌, అల్విన్‌ కాలనీ, చిలకలగూడ, అడ్డగుట్ట, కంటోన్మెంట్‌, బోయిన్‌పల్లి, కర్ఖానా, మోహిదీపట్నం, టోలిచౌకి, షేక్‌పేట, మాదాపూర్‌, హైటెక్‌ సిటీ, కొండాపూర్‌, దిల్‌షుక్‌ నగర్‌, మలక్‌పేట్‌, కోఠి, ఉప్పల్‌, తర్నాక, మెట్టుగూడలో అతి  భారీ వర్షం పడుతోంది. పలు  ప్రాంతాల్లోని కాలనీల్లో విద్యుత్‌ సరాఫరాకు అంతరాయం ఏర్పడింది.

హైదరాబాద్ లో అత్యధికంగా మియాపూర్‌లో  14 సెం.మీ వర్షపాతం నమోదైంది. షేక్‌పేట11.9 సెం.మీల వాన కొట్టింది.  బోరబండలో  11.6 సెం.మీ, మాదాపూర్‌లో  10.7 సెం.మీ, రాయదుర్గంలో 10.1 సెంటీ మీటర్ల వాన పడింది. ఇటు  ఖైరతాబాద్‌ లో 10.1 సెంమీ, రాజేంద్రనగర్‌ లో  10 సెం.మీ, గచ్చిబౌలిలో  9.6, సెం.మీ, బహదూర్‌పురాలో  8.2, చిలకలగూడ, ఆసిఫినగర్‌  ప్రాంతాల్లో 8.1 సెం.మీ వర్షపాతం నమోదైంది.

మరోవైపు భారీ వర్షాలకు హిమాయత్‌ సాగర్‌, ఉస్మాన్‌ సాగర్‌ లోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఇప్పటికే అధికారులు 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.