మెదక్ పట్టణంలో హైడ్రామా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ

మెదక్ పట్టణంలో హైడ్రామా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ

మెదక్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సోమవారం రాత్రి మెదక్ పట్టణంలోని 15వ వార్డులోని కట్టకింది బస్తీలో హైడ్రామా చోటు చేసుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్​ వర్గాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యే అనుచరులు ఓటర్లకు డబ్బులు పంచేందుకు వచ్చారంటూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చి అడ్డుకున్నారు. ఎన్నికల ప్రచారం సమయం అయిపోయిందని, రాత్రి పూట వార్డులోకి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే అనుచరుల కార్లపై రాళ్లతో దాడి చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కార్లు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో గొడవ సద్దుమణిగింది. 

మహిళ ఫిర్యాదు..

పిట్లంబేస్​ కాలనీకి చెందిన గోదల మానస ఫిర్యాదు మేరకు 15వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి ఆరెళ్ల గాయత్రి భర్త, మున్సిపల్ మాజీ  చైర్మన్​ ఆరెళ్ల మల్లికార్జున్ గౌడ్‎తో పాటు జీవన్ రావు, వేణు, హబీబ్, మల్లేశ్​పై మెదక్  పట్టణ పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. తాను కాంగ్రెస్‎లో పని చేస్తుండగా, బీఆర్ఎస్​కు సపోర్ట్  చేయాలని మల్లికార్జున్ గౌడ్ తదితరులు ఒత్తిడి చేశారని తెలిపారు. 

తాను ఒప్పుకోకపోవడంతో కులం పేరుతో దూషించారని మానస పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలాఉంటే కాంగ్రెస్  15వ వార్డు అభ్యర్థి నరేశ్  గౌడ్, అతని తమ్ముడు మహేశ్  గౌడ్  తమపై దాడి చేశారని, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు కారుతో ఢీ కొట్టారని పిట్లంబేస్  కాలనీకి చెందిన బీఆర్ఎస్​ కార్యకర్తలు ఫర్హానా బేగం, ప్రసాద్, సురేశ్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు.