పూనమ్ చావు డ్రామా.. బతికే ఉన్నానని ఇన్​స్టాలో వీడియో

పూనమ్ చావు డ్రామా..   బతికే ఉన్నానని ఇన్​స్టాలో వీడియో
 
  • ఇదేం పిచ్చి పనంటూ నెటిజన్ల మండిపాటు
  • తాను బతికే ఉన్నానని వెల్లడి

ముంబై :  మోడల్, నటి పూనమ్  పాండే చావు డ్రామా ఆడింది. సర్వైకల్  క్యాన్సర్​తో తాను చనిపోయినట్లు ప్రకటించి తీవ్ర దుమారానికి తెరలేపింది. తాను బతికే ఉన్నానని తర్వాత వెల్లడించింది. సర్వైకల్  క్యాన్సర్ పై అవగాహన కోసమే అలా చేశానని శనివారం ఇన్ స్టాగ్రామ్​లో ఓ వీడియో పోస్టు చేసింది. ‘‘మీకు ఆసక్తికరమైన విషయం చెప్పాలనుకుంటున్నా. సర్వైకల్  క్యాన్సర్ తో నేను చనిపోలేదు. కానీ, ఆ క్యాన్సర్ పై అవగాహనలేని కొన్ని వేల మంది మహిళలు సర్వైకల్  క్యాన్సర్ తో చనిపోయారు. అందుకే ఆ ప్రాణాంతక క్యాన్సర్ పై అవగాహన కల్పించడానికి నేను చనిపోయినట్లు నా మేనేజర్ తో ప్రకటింపజేశాను. నేను చేసిన పనికి క్షమాపణ చెబుతున్నా.  చాలా మంది ఆ వార్త విని దిగ్ర్భాంతి చెందారు. 

అలాంటి వారందరికీ సారీ. సర్వైకల్  క్యాన్సర్  అంతానికి కలిసికట్టుగా పోరాడుదాం” అని 32 ఏండ్ల పూనమ్ ఆ వీడియోలో పేర్కొంది. తనపై విమర్శలు చేసే ముందు ప్రపంచవ్యాప్తంగా సర్వైకల్  క్యాన్సర్  గురించి తెలుసుకోవాలని కోరుతున్నానని పేర్కొంది. దీంతో నెటిజన్లు ఆమె తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఇదేం తుంటరి పనంటూ కామెంట్లు చేశారు. సర్వైకల్  క్యాన్సర్  నిర్మూలనకు 9 నుంచి 14 ఏండ్ల మధ్య బాలికలకు వ్యాక్సిన్  వేయిస్తామని తాజా మధ్యంతర బడ్జెట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన తర్వాతే తాను సర్వైకల్  క్యాన్సర్ తో చనిపోయినట్లు పూనమ్  ప్రకటించడంతో ఈ క్యాన్సర్ పై సోషల్  మీడియాలో తీవ్రంగా ప్రచారం జరిగింది.

దుమ్మెత్తిపోసిన సెలబ్రిటీలు 

సర్వైకల్  క్యాన్సర్ పై అవగాహన కోసం పూనమ్  చేసిన పనికి బాలీవుడ్  సెలబ్రిటీలు సైతం తీవ్రంగా ఫైర్  అయ్యారు. ఆమెది ఒక చీప్  పబ్లిసిటీ స్టంట్  అని విమర్శించారు. ‘‘సర్వైకల్  క్యాన్సర్ పై అవగాహన కల్పించాలనుకోవడం మంచిదే. కానీ, సర్వైకల్  క్యాన్సర్ తో చనిపోయినట్లు నటిస్తారా? ఇది పబ్లిసిటీ స్టంట్  తప్ప ఇంకొకటి కాదు” అని పూజా భట్, సారా అలీఖాన్, రాహుల్  వైద్య, అలీ గోని తదితరులు పూనమ్ పై మండిపడ్డారు. పూనమ్ ను, ఆమె టీంను బాయ్ కాట్  చేయాలని అలీ గోని ట్వీట్  చేశాడు.