
- రాంమాధవ్‌తో పోటీ లేదు: మురళీధర్ రావు
కులానికి నేను పెద్దగా ఇంపార్టెన్స్ఇవ్వను. కులపరమైన సంబంధాలు కూడా నాకు పెద్దగా లేవు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను నా అంత ఎవరూ విమర్శించి ఉండరు. మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావుతో నేను కలిసి పని చేయలేదు. ఆయనతో నాకు పెద్దగా వ్యక్తిగత సంబంధాలు కూడా లేవు. మా పార్టీ సీనియర్‌నేత రాంమాధవ్ కు పోటీ లేదు, నాకు మాత్రం పోటీ
ఉంది. నేను ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటాను. ఆయన అలా కాదు” అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు చెప్పారు. తెలంగాణ రాజకీయాల్లో కులం కార్డు పని చేయదని, కానీ ఏపీలో మాత్రం పని చేస్తుందన్నారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో చిట్చాట్చేసిన ఆయన అనేక విషయాలను పంచుకున్నారు.
బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ చాన్స్ వదులుకున్నా..
2018లో అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత తమ పార్టీ ఎమ్మెల్యేలు కేసీఆర్ ను కలిస్తే, సీఎంను ఎందుకు కలిశారని వారిని ప్రశ్నించానని మురళీధర్‌రావు తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ బలంగా లేనప్పుడు తనకు ప్రాధాన్యత ఉండాలని కోరుకోవడం కూడా సరికాదన్నారు. తాను 30 ఏళ్లుగా పార్టీ కోసం పని చేసినందుకే జాతీయ స్థాయిలో పార్టీ పదవి వచ్చిందన్నారు. గతంలో బీజేపీ స్టేట్ప్రెసిడెంట్ గా చాన్స్ వచ్చినా వదులుకున్నానని వెల్లడించారు. ‘‘రాష్ట్రంలో గవర్నర్ ద్వారా రాజకీయాలు చేయం. అలా చేస్తే అది మాకే నష్టం. గవర్నర్ ను అడ్డం పెట్టుకొని అధికార టీఆర్ఎస్ పై మేం కక్ష సాధింపులకు దిగం’ అని మురళీధర్ రావు స్పష్టం చేశారు.