i-Bomma Closed: ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్‌సైట్లు క్లోజ్.. ఇమ్మడి రవికి 14 రోజుల రిమాండ్‌!

i-Bomma Closed:  ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్‌సైట్లు క్లోజ్.. ఇమ్మడి రవికి 14 రోజుల రిమాండ్‌!

సినీ ఇండస్ట్రీకి దశాబ్దాలుగా కంటి మీద కునుకు లేకుండా చేసిన సినిమా పైరసీ భూతంపై సైబర్ క్రైమ్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. లక్షలాది మంది వీక్షకులను ఆకర్షించిన అక్రమ స్ట్రీమింగ్ వెబ్‌సైట్ ఐబొమ్మ (i-Bomma) నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కూకట్‌పల్లిలోని అతని నివాసంలో అరెస్ట్ చేశారు.  పోలీసుల చర్యతో కేవలం ఐబొమ్మే కాకుండా, దానికి అనుబంధంగా ఉన్న బప్పం టీవీ (Bappam TV) వెబ్‌సైట్లను కూడా శాశ్వతంగా మూసివేశారు. విచారణలో భాగంగా రవి నుంచి వెబ్ లాగిన్‌లు, సర్వర్ వివరాలు సేకరించి, సాంకేతికంగా ఆ రెండు వెబ్‌సైట్లు ప్రస్తుతం ఓపెన్ కాకుండా నిలిపివేశారు.

 అరెస్టులో కీలక ఆధారాలు..

కూకట్‌పల్లిలోని రవి ఫ్లాట్‌లో పోలీసులు జరిపిన సోదాలు చూసి ఆశ్చర్యపోయారు. ఈ రైడ్‌లో వందల సంఖ్యలో హార్డ్ డిస్క్‌లు, అత్యాధునిక కంప్యూటర్‌లు, ల్యాప్‌టాప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లేటెస్ట్ గా విడుదలైన కొన్ని సినిమాల HD ప్రింట్‌లను అప్‌లోడ్ చేయడానికి సిద్ధంగా ఉంచిన కంటెంట్‌ను కూడా అధికారులు నిలిపివేయగలిగారు. ఈ కంటెంట్ బయటికి వచ్చి ఉంటే, సినీ పరిశ్రమకు మరోసారి భారీ నష్టం వాటిల్లేది.

విచారణలో రవి నుంచి కీలక సమాచారాన్ని పోలీసులు రాబట్టినట్లు సమాచారం. ఈ పైరసీ సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడు, సినిమా ప్రింట్‌లను ఎలా సంపాదించాడు అనే కీలక వివరాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇతని ఆధీనంలో ఉన్న వందల హార్డ్ డిస్క్‌లను పరిశీలించడం ద్వారా, ఈ పైరసీ నెట్‌వర్క్‌లో ఇంకెవరైనా ఉన్నారా అనే దానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

14 రోజుల రిమాండ్..

ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి గతంలో పోలీసులకు, సినీ పరిశ్రమకు బహిరంగంగా ఛాలెంజ్ విసిరాడు. "నా వద్ద కోట్ల మంది డేటా ఉంది. నన్ను టార్గెట్ చేస్తే ఏం చేయాలో నాకు తెలుసు" అంటూ హెచ్చరించాడు. ఈ బెదిరింపులను పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. రవిని అరెస్ట్ చేయడానికి వ్యూహాత్మకంగా కొన్ని నెలల పాటు టెక్నికల్ నిఘా పెట్టారు.  ఇంతకాలం తప్పించుకు తిరుగుతున్న రవిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు.

సీవీ ఆనంద్ హర్షం ...

అరెస్ట్ అనంతరం రవిని మెజిస్ట్రేట్ నివాసంలో ప్రవేశపెట్టగా.. 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో అతన్ని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో మరింత సమాచారం రాబట్టడం కోసం, సోమవారం నాడు నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్‌ను దాఖలు చేయాలని సైబర్ క్రైమ్ పోలీసులు నిర్ణయించారు.   ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్‌పై తెలంగాణ హోం శాఖ స్పెషల్ సీఎస్ సీవీ ఆనంద్ (CV Anand) హర్షం వ్యక్తం చేశారు. గతంలో పోలీసులకు "దమ్ముంటే పట్టుకోండి నన్ను" అని సవాలు విసిరిన వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారని ఎక్స్  వేదికగా ఆయన ట్వీట్ చేశారు.

జూన్ 5వ తేదీ నుంచి సైబర్ క్రైమ్ టీమ్ రేయింబవళ్లు కష్టపడి రవి సహా ఈ పైరసీలో ఉన్న కీలక వ్యక్తులందరినీ పట్టుకుందని ఆనంద్ ప్రశంసించారు. డిజిటల్ కంపెనీల సర్వర్‌లను హ్యాక్ చేసి సినిమా విడుదల కంటే ముందే హెచ్‌డీ ప్రింట్‌లను రిలీజ్ చేస్తున్న ఈ ముఠాను అరికట్టడం గొప్ప విషయమన్నారు. ఈ విజయం సాధించిన డీసీపీ కవిత, హైదరాబాద్ సీపీ సజ్జనార్‌లతో పాటు సైబర్ క్రైమ్ టీమ్‌కు ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ అరెస్ట్‌తో తెలుగు సినీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. పైరసీని అరికట్టడంలో ఇది ఒక చారిత్రక మైలురాయిగా భావిస్తున్నారు.

.