ఒక జిల్లాకే పరిమితం కావడం ఇష్టం లేకనే..

ఒక జిల్లాకే పరిమితం కావడం ఇష్టం లేకనే..
  • నేను రాజకీయాల్లోకి రావడానికి కారణం ఆయనే: మాజీ ఐఏఎస్ వెంకట్రామిరెడ్డి

హైదరాబాద్: సర్వోన్నత ఐఏఎస్ పదవిని ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది.. రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నారనే సందేహాలపై తాజా మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డి వివరణ ఇచ్చారు. అంతే కాదు తాను సిద్దిపేట కలెక్టర్ గా ఉన్న సమయంలో కేసీఆర్ కాళ్లు మొక్కడానికి కారణమేంటో.. కూడా ఆయన వెల్లడించారు. ఐఏఎస్ అధికారి పదవికి రాజీనామా లేఖను చీఫ్ సెక్రెటరీకి అందించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఐఏఎస్ అధికారిగా ఒక జిల్లాకే పరిమితం కావడం ఇష్టం లేదని.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజీనామా చేసి రాజకీయాల్లోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి విధానాలు నన్ను రాజకీయాల్లో చేరేలా ప్రేరేపించాయని తెలిపారు. 
రాష్ట్రపతి హోదాలో ఉన్నోల్లే పుట్టపర్తి సాయిబాబా కాళ్లు మొక్కారు
సీఎం కేసీఆర్ తెలంగాణ సాధించిన ప్రదాత, అయన నేతృత్వంలో పనిచేయడం అదృష్టం అని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రానికి తండ్రి స్థానంలో కేసీఆర్ ఉన్నారని, అందుకే కాళ్లు మొక్కానని, సీఎం కేసీఆర్ ను రాజకీయ నాయకుడిగా చూడలేదన్నారు. ప్రధాని, రాష్ట్రపతి హోదాలో ఉన్నవారే పుట్టపర్తి సాయిబాబా కాళ్లు మొక్కారని వెంకట్రామిరెడ్డి గుర్తు చేశారు. నకిలీ విత్తనాలు అమ్మవద్దంటూ చేసిన కామెంట్లను వక్రీకరించారని ఆయన పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సేవలు అందిస్తానని, ఏ బాధ్యతలు అప్పగించినా స్వీకరించి చేసేందుకు సిద్ధంగా ఉన్నానని  మాజీ ఐఏఎస్ వెంకట్రామి రెడ్డి వివరించారు.