
కరాచి: ఇండియా మాజీ క్రికెటర్, ప్రస్తుత ఎంపీ గౌతం గంభీర్ లిమిటెడ్ ఓవర్స్ కెరీర్ తన కారణంగానే ముగిసిందని పాకిస్థాన్ పేసర్ మహ్మద్ ఇర్ఫాన్ అంటున్నాడు.ఇండియాలో 2012లో జరిగిన లిమిటెడ్ ఓవర్ సిరీస్‌లో గంభీర్‌ను నాలుగుసార్లు ఔట్ చేసిన ఇర్ఫాన్.. ఓ దశలో తనను ఎదుర్కొనేందుకు గౌతీ జంకాడని ఎద్దేవా చేశాడు. ‘ఇండియాతో సిరీస్‌లో ఆడినప్పుడు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ నా బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడేవారు. నేను వేసిన బంతిని సరిగ్గా చూడలేకపోతున్నామని వాళ్లే నాకు చెప్పారు. ఆ సిరీస్‌తోనే గంభీర్ వైట్‌బాల్ కెరీర్ ముగిసింది. ఆ సమయంలో మ్యాచ్‌లో అయినా.. కనీసం ఇరు జట్ల నెట్ సెషన్‌లో అయినా గంభీర్ నన్ను ఫేస్ చేయడానికి ఇష్టపడలేదు. కనీసం నా కళ్లలోకి కళ్లు పెట్టి చూసేందుకు కూడా అతను సిద్ధంగా లేడని నాకు అనిపించేంది.
ఆ సిరీస్‌లో గంభీర్‌ను నాలుగుసార్లు ఔట్ చేశా. నా బౌలింగ్‌లో ఆడేందుకు అతని కాన్ఫిడెన్స్ పూర్తిగా దెబ్బతిన్నది. నన్ను చూసి ఓ బ్యాట్స్‌మన్ భయపడ్డాడని నేను చెప్పలేను గానీ.. గంభీర్ వైట్‌బాల్ కెరీర్‌ను అంతం చేసినందుకు చాలామంది నన్ను అభినందించారు’అని ఓ టీవీ షోలో పాల్గొన్న ఇర్ఫాన్ చెప్పుకొచ్చాడు. నిజానికి ఈ సిరీస్‌లోనే తన కెరీర్‌లో చివరి టీ20 ఆడిన గంభీర్.. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో సిరీస్ అనంతరం వన్డేలకూ దూరమయ్యాడు. అయితే, ఇర్ఫాన్ కామెంట్స్‌పై గంభీర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అతనిది పబ్లిసిటీ స్టంట్ అని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.