దర్శకుడిగా పరిచయమై నటుడిగా బిజీ అయిన తరుణ్ భాస్కర్.. ‘ఓం శాంతి శాంతి శాంతిః’ చిత్రంతో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈషారెబ్బా హీరోయిన్. ఏఆర్ సజీవ్ దర్శకుడు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం గురించి, తన కెరీర్ గురించి తరుణ్ భాస్కర్ ఇలా ముచ్చటించాడు.
‘‘సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ రావడం హ్యాపీ. ప్రేక్షకులు ఎంటర్‌టైన్ అవడానికి తగ్గ కథ ఇస్తే, అది రీమేక్ అయినా కచ్చితంగా ఆదరిస్తారని మరోసారి ప్రూవ్ అయింది. ఓంకార్ నాయుడు పాత్ర కోసం చాలా హోంవర్క్ చేశా. గోదావరి యాస, ఆ బాడీ లాంగ్వేజ్ వ్యక్తిగతంగా నాకు పూర్తి భిన్నమైనది. కెరీర్‌లో ఎక్కువ సంతృప్తినిచ్చిన ఛాలెజింగ్ క్యారెక్టర్ ఇది. నటన మీద చాలా గౌరవం పెరిగింది. సెట్స్‌లో నటనకు పరిమితం అవుతాను తప్ప సలహాలు, సూచనలు అడిగినా సరే ఇవ్వడానికి ఇష్టపడను. అలా ఈ సినిమా క్రెడిట్ అంతా డైరెక్టర్ సజీవ్ దే.
ఇక ఈషా అద్భుతంగా చేసింది. ఒక సీన్‌లో తనని కొట్టాలి. డైరెక్టర్ నిజంగా కొడితేనే ఆ ఎఫెక్ట్ వస్తుంది అని చెప్పాడు. తనకి తెలియకుండా కొట్టాను. పాపం తను ఏడ్చేసింది. సింగిల్ టేక్‌లో ఆ షాట్ ఓకే అయింది కాబట్టి బ్రతికిపోయాం. రీటేక్ చెప్పుంటే కష్టమే (నవ్వుతూ). ఇక నాతో పాటు వచ్చిన దర్శకులతో పోల్చి చూస్తే నేనేమీ వెనకబడ్డట్టుగా అనిపించలేదు. నాలుగు సినిమాలు చేశా, మరొకటి లైనప్‌లో ఉంది. టీవీ షో, ఇతర సినిమాలకు డైలాగ్స్, కథ ఓకే చేసి ప్రొడక్షన్ చేయించడం, నటించడం చాలా పనుల్లో బిజీగా ఉన్నా.
ఈ జర్నీ మీద నాకు ఎలాంటి రిగ్రేట్ లేదు. నటుడిగా మంచి పేరొచ్చినా వ్యక్తిగత సంతృప్తి మాత్రం డైరెక్షన్‌లోనే. ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ షూటింగ్‌ను ఎంజాయ్ చేస్తున్నాం. తొలి సినిమాతో పోల్చుకుంటే స్కేల్ పెద్దగా ఉంటుంది. ఇంటరెస్టింగ్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఒకే జానర్‌కు ఫిక్స్ అవకుండా డిఫరెంట్ జానర్ సినిమాలు చేయాలనుంది’’.
