నన్ను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయలేదు! : ఎమ్మెల్యే దానం

నన్ను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయలేదు! : ఎమ్మెల్యే దానం
  •     ఆ పార్టీ తీసుకునే యాక్షన్ ఆధారంగానే నా రియాక్షన్: ఎమ్మెల్యే దానం
  •     ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి వేసిన పిటిషన్లపై నేడు విచారణ

హైదరాబాద్, వెలుగు: తనను బీఆర్ఎస్ సస్పెండ్ చేయలేదని, తాను ఆ పార్టీకి రాజీనామా చేయలేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు. మీరు ఏ పార్టీలో ఉన్నారని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన ఆ కామెంట్లు చేశారు. ‘బీఆర్ఎస్ వాళ్లు నాపై తీసుకునే యాక్షన్ ఆధారంగానే నా రియాక్షన్ ఉంటది. నేను ఎన్నికలకు భయపడేదిలేదు. ప్రజా క్షేత్రంలో పోరాడేందుకు ఎప్పుడూ సిద్ధమే’ అని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న దానం అనర్హత పిటిషన్​పై శుక్రవారం స్పీకర్ గడ్డం ప్రసాద్ సమక్షంలో విచారణ జరగనున్నది. ఈ సందర్భంగా సిటీలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన్ను గురువారం మీడియా పలకరించగా, పై విధంగా స్పందించారు. 

స్పీకర్ ఇచ్చిన నోటీసులకు తన అడ్వకేట్ అఫిడవిట్ పంపించారని, అందులో తనది ఏ పార్టీ అని పేర్కొన్నారో  తెలియదన్నారు. కానీ, తాను ప్రస్తుతం ఖైరతాబాద్ ఎమ్మెల్యేనని చెప్పారు.  తన తరఫున అడ్వకేట్లు హాజరవుతారని దానం వెల్లడించారు. కాగా, శుక్రవారం ఉదయం అసెంబ్లీలోని ట్రిబ్యునల్ హాల్‌‌‌‌ లో దానం నాగేందర్ పై కౌశిక్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి వేసిన అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ చేపట్టనున్నారు.