ఇంత దరిద్రమైన ఎన్నికలు చూడలె : ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ఇంత దరిద్రమైన ఎన్నికలు చూడలె : ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మున్సిపల్​ ఎన్నికలు నిజాయితీగా జరిగినవి కాదని, 25 ఏండ్లలో ఇంత దరిద్రమైన ఎన్నికలను ఎప్పుడు చూడలేదని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రజాకార్లకంటే దారుణంగా మున్సిపల్ ఎన్నికల్లో పోలీసులు వ్యవహరించారన్నారు. మంగళవారం గాంధీభవన్ లో కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎక్స్ అఫీషియో ఓట్లతో యాదగిరిగుట్టలో టీఆర్ఎస్​ గెలిచిందని, ఆదిబట్లలో తమకు మెజారిటీ వచ్చినా కాంగ్రెస్ కౌన్సిలర్​ను తీసుకుపోయి టీఆర్ఎస్ నుంచి చైర్మన్ చేశారని ఆరోపించారు. సిరిసిల్లలో రెబల్స్ పోటీ చేస్తే సస్పెండ్ చేస్తానని చెప్పిన కేటీఆర్, మళ్లీ వారిని పార్టీలో ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించారు. గజ్వేల్ మున్సిపల్ చైర్మెన్ ను చేస్తానని చెప్పి నారాయణరెడ్డిని సీఎం కేసీఆర్​ మోసం చేశారన్నారు. కేసీఆర్, కేటీఆర్ లు సిగ్గు, లజ్జ లేకుండా పనిచేస్తున్నారని, గ్రామగ్రామాన తిరిగి, కేసీఆర్, కేటీఆర్ ల తీరును ఎండగడతామని ప్రకటించారు.  కేసీఆర్ కుటుంబం మొత్తం జైలుకు వెళ్లే రోజు త్వరలోనే వస్తుందని కోమటిరెడ్డి అన్నారు. కేసీఆర్, కేటీఆర్ చేసిన స్కాంలపై ఆధారాలను ఈడీ, విజిలెన్స్ కు ఇస్తానని, వీళ్ల దోపిడీని పార్లమెంట్​లో ఎండగడతానని చెప్పారు. రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం విద్యుత్​ చార్జీలు పెంచుతుందని, చిన్న చిన్న గ్రామాలను మున్సిపాల్టీలు చేశారని, వాటిల్లోనూ పన్నులు పెంచుతారని అన్నారు. తనకు పీసీసీ చీఫ్ పదవి ఇస్తే తీసుకుని చేస్తానని చెప్పారు.