ఐప్యాక్‌‌ ఆఫీస్పై రెయిడ్స్‌‌.. ఈడీ ఆఫీసర్లపై కేసు

ఐప్యాక్‌‌ ఆఫీస్పై రెయిడ్స్‌‌.. ఈడీ ఆఫీసర్లపై కేసు
  • కోల్‌‌కతా, బిధాన్‌‌నగర్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్
  • దర్యాప్తును అడ్డుకున్నారని మమతపై కోర్టుకెక్కిన ఈడీ
  • ఈడీకి వ్యతిరేకంగా సర్కారు పిటిషన్ మమత నేతృత్వంలో భారీ ర్యాలీ
  • పశ్చిమ బెంగాల్‌‌లో పొలిటికల్ హీట్​ 

కోల్‌‌కతా: పొలిటికల్‌‌ కన్సల్టెన్సీ సంస్థ ఐప్యాక్ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్​జైన్‌‌ ఇంటిపై ఈడీ రైడ్స్‌‌తో బెంగాల్‌‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై శుక్రవారం  కేంద్రం, బెంగాల్ ప్రభుత్వాల మధ్య ఘర్షణ తీవ్రమైంది. ఈడీ రైడ్స్‌‌ను వ్యతిరేకిస్తూ సీఎం మమతా బెనర్జీ సర్కారు రెండు ఫిర్యాదులు దాఖలు చేసింది. షేక్స్‌‌పియర్ సరణి పోలీస్‌‌ స్టేషన్‌‌లో  ఈడీ అధికారులు, సీఆర్‌‌పీఎఫ్ సిబ్బందిపై ఫిర్యాదు చేయగా..  సాల్ట్ లేక్‌‌లోని ఐ-ప్యాక్ కార్యాలయంపై దాడికి సంబంధించి బిధానగర్‌‌‌‌లో మరొక కంప్లయింట్​ఇచ్చారు. ఈ కంప్లయింట్స్​ఆధారంగా కోల్‌‌కతా,  బిధాన్‌‌నగర్ పోలీసులు ఎఫ్‌‌ఐఆర్‌‌లు నమోదు చేసి, దర్యాప్తు మొదలెట్టారు. కాగా, ఈ దాడులు బెంగాల్‌‌లోని బొగ్గు అక్రమ రవాణా (కోల్ పిల్ఫరేజ్) స్కామ్‌‌కు సంబంధించిన మనీలాండరింగ్ దర్యాప్తులో భాగమని ఈడీ వాదిస్తున్నది. ఈ దాడులు రాజకీయ ప్రేరేపితమైనవని, టీఎంసీ ఎన్నికల వ్యూహాలు, అభ్యర్థుల జాబితా,  పార్టీకి సంబంధించిన సెన్సిబుల్​ డేటా దొంగిలించడానికి చేసిన ప్రయత్నమని మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు.

కోర్టును ఆశ్రయించిన ఈడీ, మమతా సర్కారు

మనీలాండరింగ్‌‌ కేసులో దర్యాప్తును మమతా సర్కారు అడ్డుకున్నదని ఆరోపిస్తూ హైకోర్టును ఈడీ ఆశ్రయించింది. సీఎం మమతా బెనర్జీ తమ విధులను అడ్డుకున్నారని, కీలక ఆధారాలను బలవంతంగా తీసుకెళ్లారని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరింది. కాగా, ఈ దాడుల్లో తమ పార్టీకి సంబంధించిన అత్యంత కీలకమైన రాజకీయ సమాచారాన్ని (ముఖ్యంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల జాబితా, వ్యూహాలు) ఈడీ అక్రమంగా సేకరిస్తున్నదని తృణమూల్​కాంగ్రెస్ (టీఎంసీ) కూడా హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్లపై కోల్‌‌కతా హైకోర్టు జస్టిస్ సువ్ర ఘోష్ విచారణ చేపట్టినప్పటికీ.. భారీగా జనం హాజరుకావడంతో కోర్టు రూమ్‌‌ను విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఈ పిటిషన్లను వచ్చే బుధవారం (జనవరి 14) తిరిగి విచారణ చేపట్టనున్నారు. కోల్‌‌కతా హైకోర్టులో కేసు విచారణ వాయిదా పడటంతో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌‌ను ఈడీ శుక్రవారం ఆశ్రయించింది. తక్షణ విచారణ కోసం బెంచ్‌‌ ఏర్పాటు చేయాలని కోరింది.  

కోల్​కతా​లో మమత ర్యాలీ.. ఢిల్లీలో​ అమిత్​ షా ఇంటిముందు ఎంపీల ధర్నా

ఈడీ దాడులను వ్యతిరేకిస్తూ  సీఎం మమతా బెనర్జీ భారీ ర్యాలీ చేపట్టారు.  జాదవ్‌‌పూర్ నుంచి హజ్రా క్రాసింగ్ వరకు 5 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు. ఈ మెగా ర్యాలీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకుముందు ఈడీ దాడులను నిరసిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్‌‌ షా కార్యాలయం వెలుపల టీఎంసీ ఎంపీలు నిరసన చేపట్టారు. ఎన్నికల ముందు ఈడీని కేంద్రం అస్త్రంలా వాడుకుంటున్నదని టీఎంసీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. అయితే, అమిత్‌‌ షా ఇంటి వద్ద టీఎంసీ నేతలు నిరసనలు తెలపడంతో పోలీసులు వారిని నిరసన ప్రాంతం నుంచి లాక్కెళ్లారు. తాము శాంతియుతంగా ఆందోళన చేపట్టామంటూ పోలీసుల చర్యను నేతలు ఖండించారు.