- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కామెంట్
- తరచూ వింత వ్యాఖ్యలతో అభాసుపాలు..
- అమెరికా అధ్యక్షుడిపై మీమ్స్ వెల్లువ
- ఆయన ‘అయతుల్లా డొనాల్డ్ జె. ట్రంప్’ అంటూ నెటిజన్ల సెటైర్లు
వాషింగ్టన్: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌పై మళ్లీ సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తాయి. ఇరాన్ ప్రజలు తమ దేశానికి సుప్రీం లీడర్గా ఉండాలని తనను కోరారని.. కానీ తానే ఆ పదవి వద్దని చెప్పానని ట్రంప్ కామెంట్ చేశారు. ఈ కామెంట్‌తో ట్రంప్‌పై నెటిజన్లు సోషల్ మీడియాలో మీమ్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘ఎక్స్’ వేదికగా 'అయతుల్లా డొనాల్డ్ జె. ట్రంప్' పేరిట యూజర్లు సెటైర్లు వేస్తున్నారు. బుధవారం ఓ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘ఏ పనీ ఉండని ఇరాన్ సుప్రీం లీడర్ పదవి చేపట్టాలనుకున్న దేశాధినేత ఎవరూ ఉండరు. అయితే, వారి మాటలు మాకు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ‘మిమ్మల్ని తదుపరి సుప్రీం లీడర్‌గా చేయాలనుకుంటున్నాం’ అని వారు అంటున్నారు. కానీ నాకు అది వద్దు. ధన్యవాదాలు. నాకు అది ఇష్టం లేదు" అని సరదాగా అన్నారు. దీనిపై ‘ఎక్స్’లో స్పందించిన ఒక యూజర్ ‘అయతుల్లా డొనాల్డ్ జె. ట్రంప్’ అంటూ సెటైర్ వేశారు. మరొకరు ‘అయతుల్లా చనిపోయారు. డొనాల్డ్ జె. ట్రంప్ బాధ్యతలు చేపట్టారు. పరిస్థితులు ఇంకా దారుణంగా ఉండొచ్చు’ అని పేర్కొన్నారు.
ఒకవైపు, అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్, మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్ వేషధారణలో ఉన్న ట్రంప్ పక్కపక్కనే కూర్చుని చర్చలు జరుపుతున్నట్టుగా ఏఐ ఫొటోలతో నెటిజన్లు హోరెత్తిస్తున్నారు. అంతకుముందు ఇరాన్ యుద్ధంతో చమురు ధరలు పెరిగితే తమకే ఎక్కువ లాభాలంటూ వ్యాఖ్యానించారు. నాటో కూటమిలో ఉన్నవారు పిరికిపందలంటూ నోరుపారేసుకున్నారు. కాగా, ట్రంప్ గతేడాది భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ పదే పదే చెప్పుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 8 యుద్ధాలు ఆపినా.. తనకు నోబెల్ శాంతి బహుమతి రాలేదన్నారు. గ్రీన్ లాండ్ స్వాధీనం చేసుకుంటానని, కెనడా అమెరికాలో విలీనం కావాలంటూ దుమారం రేపారు. అయితే, ట్రంప్ వైఖరిని కొందరు ఒక వ్యూహం అని భావిస్తే, మరికొందరు అపరిపక్వతగా చూస్తారు. ఏది ఏమైనా, పశ్చిమాసియా నుంచి దక్షిణాసియా వరకు ఏ మూల ఏ ఘర్షణ జరిగినా, ట్రంప్ తనదైన శైలిలో ఇచ్చే ‘క్రేజీ’ కామెంట్లు మాత్రం ఆగడం లేదు.
