రాజస్థాన్ ముఖ్యమంత్రిగా నన్ను వెంటనే నియమించాలె!

రాజస్థాన్ ముఖ్యమంత్రిగా నన్ను వెంటనే నియమించాలె!
  • రాజస్థాన్ ముఖ్యమంత్రిగా నన్ను వెంటనే నియమించాలె!
  • సోనియాకు సచిన్ పైలట్​ అల్టిమేటం 
  • లేకుంటే వచ్చే ఎన్నికల్లో పంజాబ్ తరహా ఓటమి తప్పదని హెచ్చరిక 
    పార్టీలో దిద్దుబాటు చర్యలపై సోనియా ఫోకస్ 

న్యూఢిల్లీ : రాజస్థాన్ సీఎంగా వెంటనే తనను నియమించాలని, లేకపోతే రాష్ట్రంలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ తరహా ఓటమి తప్పదని కాంగ్రెస్ చీఫ్​ సోనియా గాంధీకి ఆ పార్టీ నేత సచిన్ పైలట్ అల్టిమేటం జారీ చేశారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్​ గెహ్లాట్, సచిన్ పైలట్​ మధ్య పోటాపోటీ వార్ కొనసాగింది. చివరి నిమిషంలో పైలట్ వర్గాన్ని శాంతింపజేసిన హైకమాండ్.. గెహ్లాట్​నే సీఎంగా ప్రకటించింది. అయితే, వచ్చే ఏడాది ఎన్నికలున్న నేపథ్యంలో సీఎం పదవి కోసం సచిన్ పైలట్ ప్రయత్నాలు ముమ్మరం చేశారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.  వారం కిందట ఆయన.. సోనియా, ప్రియాంక గాంధీలతో సమావేశమయ్యారు. పంజాబ్​లో కాంగ్రెస్​పార్టీలో అంతర్గత లొల్లుల వల్లే పార్టీ ఘోరంగా ఓడిపోయిందని.. రాజస్తాన్ లో అలా జరగకూడదంటే సీఎం మార్పు తప్పనిసరి అని ఆయన తేల్చిచెప్పినట్లు సమాచారం. 

ఏఐసీసీ ఆఫర్​కు నో..  
ఇటీవలి సమావేశంలో  సచిన్​ పైలట్​కు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ పదవిని సోనియా ఆఫర్​ చేయగా.. పైలట్​ తిరస్కరించారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్ర రాజకీయాలే తనకు ముఖ్యమని, రాష్ట్రాన్ని, తన మద్దతుదారులను వదిలి రాలేనని ఆయన తేల్చి చెప్పినట్టు సమాచారం. అయితే 2023 ఎన్నికల వరకు వేచి చూడాలని పైలట్​కు సోనియా సూచించారని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసి.. మే 13 నుంచి 15 వరకు రాజస్తాన్​లోని ఉదయ్​పూర్​లో జరగనున్న ‘చింతన్ శివిర్​ (మేధోమథనం)’పై ఫోకస్ పెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది.