V6 News

ఎల్ నినో క్లైమేట్ చేంజ్ కాదు.. గ్లోబల్ వార్నింగ్ బెల్!

ఎల్ నినో క్లైమేట్ చేంజ్ కాదు.. గ్లోబల్ వార్నింగ్ బెల్!

ప్రపంచ వాతావరణ వ్యవస్థలో అత్యంత ప్రభావం చూపే ఎల్​ నినో (El Nino).. కేవలం సముద్ర ఉష్ణోగ్రతల్లో వచ్చే​ మార్పు కాదు. ఇది గ్లోబల్ స్థాయిలో వర్షపాతం, ఉష్ణోగ్రతలు, వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థలపై ఎక్కువకాలం ప్రభావం చూపిస్తుంది. 2026లో ఈ ఎల్ నినో మరింత ఎఫెక్టివ్​గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని రీసెంట్ స్టడీలు చెప్తున్నాయి. 

పసిఫిక్​ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు (ఎల్​ నినో లేదా లా నినా), వాతావరణ పీడనాల్లో (సదరన్​ ఆసిలేషన్​) మార్పులు జరగడం వల్ల ఎల్​ నినో లేదా లా నినా పరిస్థితులు ఏర్పడతాయి. ఎల్​ నినో అంటే టెంపరేచర్స్​ సాధారణం కంటే ఎక్కువగా పెరిగి, బలహీనమైన గాలులు వీస్తాయి. అదెలాగంటే సాధారణ పరిస్థితుల్లో పసిఫిక్ మహాసముద్రంలో బలంగా వీచే గాలులు వేడి నీటిని పడమరవైపు మోసుకెళ్తాయి. అయితే ఈ గాలులు బలహీనపడితే తూర్పు పసిఫిక్ ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ మార్పు వర్షపాతం నమూనాలను ప్రభావితం చేస్తుంది. దీంతో ఆసియా, ఆస్ట్రేలియా ప్రాంతాల్లో వర్షాలు తగ్గుతాయి. అమెరికా ఖండాల్లో భారీ వర్షాలు పడే పరిస్థితి ఏర్పడుతుంది. లా నినా అంటే.. ఎల్​ నినోకు వ్యతిరేక దశ. సముద్ర జలాలు సాధారణం కంటే చల్లగా ఉంటాయి. బలమైన గాలులు వీస్తాయి. 

తాజా అంచనాలు

ఇటీవల వచ్చిన స్టడీస్​ ఎల్ నినో, మనదేశ మాన్​సూన్ మధ్య సంబంధం బలంగా కొనసాగుతుందని సూచిస్తున్నాయి. కొత్తగా వచ్చిన గ్లోబల్ మోడల్స్ వల్ల  మాన్​సూన్ అంచనాలను మరింత ముందుగానే పసిగట్టే సామర్థ్యం పెరుగుతోంది. అయితే అన్ని మోడల్స్ ఒకే విధంగా ఫలితాలు ఇవ్వడం లేదు. కొన్ని అంచనాలు ఎల్ నినో బలహీనంగా ఉండొచ్చని సూచిస్తుండటంతో అయోమయ పరిస్థితికి దారితీస్తోంది. దానికి కారణం క్లైమేట్ చేంజ్ కూడా. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఎల్ నినో తీవ్రత ఫ్యూచర్​లో మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని పరిశోధనలు చెప్తున్నాయి. ప్రస్తుతానికి 2026కు సంబంధించిన వాతావరణ అంచనాలు స్పష్టంగా ఒక దశ వైపు సూచిస్తున్నాయి. మే నుంచి జూలై మధ్య ఎల్ నినో బలపడే అవకాశాలు బాగా పెరిగాయి. ఈ ఏడాది చివరి వరకు ఈ పరిస్థితి కొనసాగి, 2027లో కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నమూనాలు సూచిస్తున్నాయి. కొన్ని అంచనాలు మరింత ముందుకెళ్లి “సూపర్ ఎల్ నినో” పరిస్థితి కూడా ఏర్పడొచ్చని హెచ్చరిస్తున్నాయి. అయితే మొదటి నెలల్లో ఈఎన్​ఎస్​ఓ న్యూట్రల్ పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అంచనాలు మారుతాయో లేదో చూడాలి. 

గ్లోబల్ ఎఫెక్ట్​

ఎల్ నినో ప్రభావం ఒక దేశానికే పరిమితం కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా వాతావరణాన్ని మార్చగలదు. కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన కరువు, మరికొన్ని ప్రాంతాల్లో వరదలు వచ్చే ముప్పు ఉంది. తుఫాన్​లు, హీట్‌‌వేవ్స్ తీవ్రత కూడా పెరుగుతుంది. “సూపర్ ఎల్ నినో” ఏర్పడితే గ్లోబల్ టెంపరేచర్స్​ మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఇది ప్రకృతి వైపరీత్యాలను మరింత తీవ్రంగా మార్చవచ్చు. 

మనదేశంపై ప్రభావం

మనదేశ వాతావరణ వ్యవస్థలో మాన్​సూన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఎల్ నినో ప్రభావం ఎక్కువగా ఈ మాన్​సూన్‌‌ పైనే కనిపిస్తుంది. 2026లో సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా. చారిత్రక డేటా పరిశీలిస్తే ఎల్ నినో సంవత్సరాల్లో ఎక్కువసార్లు తక్కువ వర్షాలు నమోదయ్యాయి. దీనివల్ల వర్షపాతం అసమానంగా మారి కొన్ని ప్రాంతాల్లో కరువు, మరికొన్ని ప్రాంతాల్లో తక్కువ కాల భారీ వర్షాలు పడే పరిస్థితి ఏర్పడుతుంది. వ్యవసాయ రంగంపై ఈ ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. వరి, పత్తి, సోయాబీన్ వంటి పంటల దిగుబడిపై ఎఫెక్ట్‌‌ పడుతుంది. రైతుల ఆదాయం దెబ్బతింటుంది. దీంతోపాటు ఆహార ధరలు కూడా పెరుగుతాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. --

ఇండియన్ ఓషన్ డైపోల్..

ఎల్ నినో ప్రభావాన్ని ఇండియన్ ఓషన్ డైపోల్ అనే మరో వాతావరణ వ్యవస్థ ప్రభావితం చేస్తుంది. ఇది కొన్ని సందర్భాల్లో ఎల్ నినో ప్రభావాన్ని తగ్గించగలదు లేదా మరింత పెంచగలదు. పాజిటివ్ ఐఒడి పరిస్థితుల్లో మాన్​సూన్ కొంతవరకు మెరుగుపడే అవకాశం ఉంటుంది. నెగెటివ్ పరిస్థితుల్లో కరువు తీవ్రమవుతుంది. 2026లో ఈ రెండు పరిస్థితుల మిశ్రమ సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది లా నినా నుంచి ఎల్ నినో వైపు మార్పు జరగడంతో సముద్ర ఉపరితలంలో వేడి నిల్వలు(ఓషన్​ హీట్‌ కంటెంట్‌)  పెరుగుతున్నాయి. “స్ప్రింగ్​ ప్రిడిక్టబిలిటీ బ్యారియర్” అనే అంశం కారణంగా అంచనాలు కొంత అస్పష్టంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో సాధారణ ఎల్ నినో కాకుండా మరింత శక్తివంతంగా ఎఫెక్ట్ చూపిస్తుందనే సూచనలు ఉన్నాయి.

ఇలాంటప్పుడే..

ఈ పరిస్థితుల్లో ముందస్తు జాగ్రత్త చాలా అవసరం. నీటి వనరులను కాపాడుకోవాలి. విత్తన నిల్వలు, పంట బీమా వంటి చర్యలు ప్రభుత్వం చేపట్టాల్సిన అవసరం ఉంది. రైతులు తక్కువ నీటితో పండే పంటల వైపు మళ్లడం, ఆధునిక సాగు పద్ధతులు అనుసరించడం అవసరం. వ్యక్తిగతంగా నీటి వాడకం తగ్గించాలి. కరెంట్ వాడకాన్ని​ కంట్రోల్ చేయడం​ కూడా ముఖ్యమే. ఈ ఏడాది మనదేశ మాన్​సూన్ బలహీనపడితే వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం తప్పదు. అయితే మోడర్న్​ టెక్నాలజీ, మెరుగైన అంచనాలు, పర్ఫెక్ట్ ప్లానింగ్​తో ఈ ప్రభావాన్ని కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు. ఈ ఏడాది ఎల్ నినో వస్తే అది కేవలం ఒక సహజ మార్పుగా చూడకూడదు. భవిష్యత్తు వాతావరణ సవాళ్లను ఎదుర్కొనే దిశగా అదొక హెచ్చరికగా కూడా అని భావించాలి.