ఏడుగురు ఆప్ ఎంపీల ఫిరాయింపుపై కాంగ్రెస్ విమర్శలు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీ గూటికి చేరడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. ఈ పరిణామంపై శనివారం స్పందించిన కాంగ్రెస్ బీజేపీ తన పాత ‘వాషింగ్ మెషీన్’ రాజకీయాన్ని మళ్లీ మొదలుపెట్టిందని ఎద్దేవా చేసింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ ‘బీజేపీ వాషింగ్ మెషీన్, మోదీ వాషింగ్ పౌడర్ మళ్లీ వచ్చేశాయి. తాము నైతికతకు, నిబద్ధతకు నిలువుటద్దాలమని చెప్పుకునే వారి అసలు రంగు ఇప్పుడు బయటపడింది’ అని విమర్శించారు.
కేసులు ఎదుర్కొంటున్న ఇతర పార్టీల నాయకులను తమ పార్టీలో చేర్చుకుని, ఆపై వారిపై ఉన్న కేసుల విచారణను నీరుగార్చడం బీజేపీకి అలవాటుగా మారిందని కాంగ్రెస్ ఆరోపించింది. శుక్రవారం ఆప్‌కు చెందిన రాఘవ్ చద్దా, అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్, హర్భజన్ సింగ్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని, స్వాతి మలివాల్ పార్టీని వీడి బీజేపీలో విలీనమయ్యారు. అర్వింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని పార్టీ తన మూల సిద్ధాంతాల నుండి తప్పుకుందని వారు ఆరోపించారు.

