అవినీతి జరగలేదని నిరూపిస్తే దేనికైనా రెడీ

అవినీతి జరగలేదని నిరూపిస్తే దేనికైనా రెడీ
  • అవినీతి జరగలేదని నిరూపిస్తే మంత్రి కాళ్లు మొక్కి నెత్తిన నీళ్లు చల్లుకుంట: ఎమ్మెల్యే కోమటిరెడ్డి 
  • రాజగోపాల్​రెడ్డి సవాల్ ఇరిగేషన్​ కాంట్రాక్టులపై అసెంబ్లీలో మాటల యుద్ధం

హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్​ ప్రాజెక్టుల కాంట్రాక్టులపై సోమవారం అసెంబ్లీలో దుమారం చెలరేగింది. కాంట్రాక్టులు, బిల్లుల విషయంలో కాంగ్రెస్​ ఎమ్మెల్యే  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ మధ్య మాటల యుద్ధం నడిచింది. తెలంగాణలో ప్రాజెక్టుల పేరు మీద, రీడిజైన్ల పేరు మీద లక్షల కోట్లు అప్పు చేసి సీమాంధ్ర కాంట్రాక్టర్లకు దోచిపెట్టిన విషయం వాస్తవమని రాజగోపాల్ రెడ్డి ఆరోపించగా .. రాజగోపాల్​రెడ్డి కాంట్రాక్టర్​అని, ఆయన మాట్లాడితే కాంట్రాక్టుల గురించి తప్పితే సబ్జెక్టు గురించి మాట్లాడే పరిస్థితిలో లేదని తలసాని విమర్శించడం గొడవకు కారణమైంది. ఆ తర్వాత మంత్రిని ఉద్దేశించి రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్​తో లొల్లి ముదిరింది. రాజగోపాల్​రెడ్డి చేసిన కామెంట్స్​ను వెనక్కి తీసుకోవాలని, సారీ చెప్పాల్సిందేనని మంత్రులు, టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు పట్టుబట్టగా.. తాను అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక కాంట్రాక్టర్ అని విమర్శించడం సరికాదన్నారు. 13 ఏండ్లుగా ప్రజాసేవలో ఉంటున్న తనను కాంట్రాక్టర్​ అంటే బాధపడ్డానని, అందుకే ఆ కామెంట్స్​చేసినట్లు వివరణ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టును మూడో టీఎంసీ పేరిట మళ్లీ అప్పులు తెచ్చి వాళ్లు అనుకున్న కాంట్రాక్టర్లకు వేల కోట్లు ఇచ్చేయడం బాధిస్తున్నదని, రాష్ట్రం  అప్పులపాలవుతున్నదని తాను బాధపడుతున్నట్లు చెప్పారు. సింగరేణిలో, ఇరిగేషన్​లో అవినీతి జరగలేదని నిరూపిస్తే క్షమాపణ చెప్పడమే కాదు.. మంత్రి కాళ్లు మొక్కి నీళ్లు నెత్తిన చల్లుకుంటానని సవాల్​ విసిరారు. తాను మాట్లాడిన దాంట్లో తప్పున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేయడానికైనా సిద్ధమేనన్నారు. తలసానిపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు కోమటిరెడ్డి ప్రకటించారు. రాజగోపాల్​రెడ్డి సారీ చెప్పించాల్సిందేనని, లేదంటే సస్పెండ్ చేయాలని స్పీకర్​ను టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. ఈ క్రమంలోనే సభలోకి వచ్చిన కేటీఆర్  కాంగ్రెస్‌‌ ఎమ్మెల్యేలపై  ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇదేనా సంస్కారం: కేటీఆర్​
సభ లోపల కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు.. బయట కాంగ్రెస్‌‌ పార్టీ అధ్యక్షుడు ఇష్టమున్నట్లు మాట్లాడుతున్నారని కేటీఆర్​ ఫైరయ్యారు. ‘‘సీఎంని ఉద్దేశించి వాళ్ల పార్టీ అధ్యక్షుడు అడ్డగోలుగా మాట్లాడిండు. మా పార్టీ కార్యక‌‌ర్తలు సీఎం జ‌‌న్మదిన వేడుక‌‌లు చేసుకుంటుంటే.. మూడ్రోజుల పాటు సంతాప దినాలు చేసుకోండ‌‌ని మాట్లాడుతడు. కేసీఆర్‌‌కు ఆరోగ్యప‌‌ర‌‌మైన స‌‌మ‌‌స్య వ‌‌చ్చి హాస్పిట‌‌ల్‌‌కు వెళ్తే.. బీజేపీ రిజ‌‌ల్ట్స్ చూసి హాస్పిట‌‌ల్‌‌కు పోయిండని రాజ‌‌గోపాల్ రెడ్డి మాట్లాడిండు.. ఇదేనా వీరి సంస్కారం’’ అని కేటీఆర్​ ప్రశ్నించారు. ఒక బ‌‌ల‌‌హీన‌‌వ‌‌ర్గాల మంత్రిని ప‌‌ట్టుకొని వ్యక్తిత్వ హననం చేసే కామెంట్లు చేయడం దారుణ‌‌మ‌‌న్నారు.