రేవంత్​ రాజీనామా చెయ్​..నేను ముఖ్యమంత్రినై రిపేర్​ చేయిస్త : హరీశ్ రావు

రేవంత్​ రాజీనామా చెయ్​..నేను ముఖ్యమంత్రినై రిపేర్​ చేయిస్త  :  హరీశ్ రావు
  • మేడిగడ్డపై రాజకీయం చేస్తున్నరు :  హరీశ్
  •     బ్యారేజీ కుంగుబాటుపై ఎలాంటి విచారణకైనా సిద్ధం
  •     బాధ్యులను శిక్షించాలని అసెంబ్లీలోనే కోరినం
  •     దేశంలో ఇది వరకు ఏవీ కుంగనట్టు మాట్లాడ్తున్నరు
  •     పెరిగిన ఊట, ఉబికొస్తున్న బోర్ల పంపులన్నీ కాళేశ్వరం ఫలాలేనని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు : రేవంత్​రెడ్డికి చేతకాకపోతే సీఎం పదవికి రాజీనామా చేయాలని, తాను ముఖ్యమంత్రిని అయ్యి మేడిగడ్డ బ్యారేజీని పునరుద్దరించి చూపిస్తానని మాజీ మంత్రి హరీశ్​రావు అన్నారు. ‘‘మేడిగడ్డ రిపేర్లకు ఇప్పుడు కూడా అవకాశం ఉంది.. ఇదే విషయం ఇంజనీర్లు చెప్తున్నరు.. కాంగ్రెసోళ్లకు చాతకాకపోతే ప్రభుత్వాన్ని మాకు అప్పజెప్పమనండి.. వాళ్లు తప్పుకుంటే మేం చేసి చూపిస్తం. రేవంత్​రెడ్డిని రాజీనామా చేయమనండి.. నేను సీఎంను  అయ్యి మేడిగడ్డకు రిపేర్​ చేయించి చూపిస్త.. నాకు మద్దతిస్తానంటే రెడీ” అని వ్యాఖ్యానించారు. బుధవారం తెలంగాణ భవన్​లో మీడియాతో హరీశ్​రావు మాట్లాడారు. లోక్​సభ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే కాళేశ్వరంపై వరద, బురద రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ‘‘వాళ్లు ఎంత దుష్ప్రచారం చేసినా కాళేశ్వరం తెలంగాణ వరప్రదాయిని. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం, భూగర్భ జలాలు పెరగడమే ఇందుకు నిదర్శనం” అని పేర్కొన్నారు.

 మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విచారణ చేసి బాధ్యులను శిక్షించాలని తాము అసెంబ్లీలోనే కోరినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం బ్యారేజీ పునరుద్ధరణ పనులు చేపట్టకుండా రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తున్నదని దుయ్యబట్టారు.  ‘‘దేశంలో ఇది వరకు ఇలాంటి ఘటనలే జరగలేదన్నట్టు చెప్తున్నరు. ఎలాంటి విచారణకైనా మేం సిద్ధం. రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలి” అని డిమాండ్​ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక్క మేడిగడ్డ బ్యారేజీ అన్నట్టుగా దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ‘‘కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌస్​లు, 203 కి.మీ.ల సొరంగాలు, 1,531 కి.మీ.ల గ్రావిటీ కాల్వలు, 98 కి.మీ.ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు నీటిని లిఫ్ట్ చేయడం, ఏటా 240 టీఎంసీలను వినియోగించడం” అని చెప్పారు. 

కూడెల్లి పొంగిందన్నా కాళేశ్వరం ఫలమే

మేడిగడ్డకు ఎమ్మెల్యేలను తీసుకెళ్లే దారిలోనే పచ్చని పంట పొలాలను కూడా వారికి చూపించాల్సిందని హరీశ్​రావు అన్నారు. ఎల్ఎండీ​ నుంచి సూర్యాపేట వరకు నిండిన చెరువులు, పండిన పంటలు, భూమిలో పెరిగి ఊట, మోటార్లు లేకుండా ఉబికి వస్తున్న బోర్ల పంపులన్నీ కాళేశ్వరం ఫలాలేనని ఆయన తెలిపారు. ఎండాకాలంలో కూడెల్లి వాగు పొంగిందన్నా, హల్దీ వాగు దుంకిందన్నా, అన్నపూర్ణ, రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ నిండిందన్నా అది కాళేశ్వరం ఫలితమేనని చెప్పారు. ‘‘కడెం కట్టగానే కొట్టుకుపోయింది. సింగూరు, ఎల్లంపల్లి, సాత్నాల ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. వాటిని పునరుద్ధరించారు. పుట్టంగండి ప్రారంభించగానే కొట్టుకుపోయింది. కాంగ్రెస్​ప్రభుత్వంలో పంజాగుట్ట ఫ్లైఓవర్​ నిర్మిస్తుండగా కూలి ఒకరు చనిపోయారు. పోలవరం డయా ఫ్రం వాల్​కొట్టుకుపోయింది. అన్నమయ్య ప్రాజెక్టు కూడా కొట్టుకుపోయింది. 

అట్లాంటిది రాజకీయాల కోసం కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నరు”అని దుయ్యబట్టారు. కాళేశ్వరం కింద 98,57‌‌‌‌‌‌‌‌0 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లిచ్చామని, ప్రాజెక్టు కాల్వలతో 546 చెరువులు నింపి 39 వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చామని తెలిపారు. ఎస్సారెస్పీ నీళ్లతో సంబంధం లేకుండా 2,143 చెరువులు నింపి వాటి కింద 1.67 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చామని ఆయన అన్నారు. 17 లక్షల ఎకరాల ఆయకట్టును కాళేశ్వరంతో స్టెబిలైజ్​ చేశామని చెప్పారు. హల్దీ వాగు, కూడెళ్లి వాగులో నీళ్లు పారించి ఇంకో 20 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చామన్నారు. ఏ ప్రాజెక్టులోనైనా మొదట హెడ్​వర్క్స్​ను పూర్తి చేసిన తర్వాతే కాల్వలు తవ్వుతారని చెప్పారు. కాళేశ్వరం రీ ఇంజనీరింగ్​అంచనాల పెంపుపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.