హైవేపై యుద్ధ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

హైవేపై యుద్ధ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

పాకిస్థాన్ బోర్డర్ సమీపంలో రాజస్థాన్ జలోర్‌‌లోని నేషనల్ హైవే 925పై యుద్ధ విమానాలను భారత వాయుసేన ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసింది. యుద్ధ సమయాల్లో లేదా మరేదైనా అత్యవసర సమయాల్లో యుద్ధ విమానాలు ల్యాండ్ అయ్యేందుకు వీలుగా దేశంలో 12 రాష్ట్రాల్లో హైవేలను ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫీల్డ్ స్ట్రిప్స్‌గా రూపుదిద్దుతోంది కేంద్ర రవాణా శాఖ. వీటిలో తొలిసారి రాజస్థాన్‌లోని 925 హైవేపై పూర్తయిన స్ట్రిప్‌పై ప్రయోగాత్మకంగా సీ-130జే, సుఖోయ్ ఎస్‌యూ-30 ఎంకేఐ లాంటి యుద్ధ విమానాల ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ డ్రిల్‌ను ఎయిర్‌‌ఫోర్స్ విజయవంతంగా పూర్తి చేసింది. సీ130జే మిలటరీ ట్రాన్స్‌పోర్ట్ విమానంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, రోడ్డు రవాణా-హైవేల మంత్రి నితిన్ గడ్కరీ, ఎయిర్‌‌ ఫోర్స్ చీఫ్ ఆర్కేఎస్ భదౌరియా ల్యాండ్ అయ్యారు.

కేవలం యుద్ధాల కోసమే కాదు..

హైవేపై ప్రయోగాత్మకంగా నిర్వహించిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ సక్సెస్ కావడంతో ఎయిర్‌‌ఫోర్స్ సహా ఇందులో భాగమైన అన్ని విభాగాలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందనలు తెలిపారు. మామూలుగా కార్లు, లారీలు చూసే చోట్ల ఇప్పుడు విమానాలను చూస్తున్నారని ఆయన అన్నారు. 12 రాష్ట్రాల్లో 20 చోట్ల ఇలాంటి ఎమర్జెన్సీ ల్యాండిండ్ ఫీల్డ్స్ సిద్ధం చేస్తున్నామని చెప్పారు. పాకిస్థాన్‌ బోర్డర్‌‌కు అతి దగ్గరలోని హైవేపై విమానాలను దింపడం ద్వారా తన సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందన్న మెజేస్‌ను ఇచ్చినట్టయిందని రాజ్‌నాథ్ అన్నారు. అయితే ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ సదుపాయం కేవలం యుద్దాల కోసమే కాదని, అత్యవసర సమయాల్లో, రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టే సమయాల్లోనూ ఉపయోగించుకోవడం కోసం రూపొందించామని చెప్పారు. ప్రకృతి విపత్తులు, కరోనా కూడా యుద్దానికి ఏ మాత్రం తక్కువ కాదని, అది యుద్ధమైనా.. ఏదైనా విపత్తు అయినా సరే ఇండియన్ ఎయిర్‌‌ఫోర్స్ అక్కడ ఉంటుందని రాజ్‌నాథ్ అన్నారు.