ఫైటర్ జెట్ల గర్జన..గంగా ఎక్స్​ప్రెస్ వేపై ల్యాండింగ్, టేకాఫ్​లు చేపట్టిన ఐఏఎఫ్

ఫైటర్ జెట్ల గర్జన..గంగా ఎక్స్​ప్రెస్ వేపై ల్యాండింగ్, టేకాఫ్​లు చేపట్టిన ఐఏఎఫ్
  • గంగా ఎక్స్​ప్రెస్ వేపై ల్యాండింగ్, టేకాఫ్​లు చేపట్టిన ఐఏఎఫ్
  • ఇండియా, పాక్​ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలోరఫేల్, మిరాజ్, మిగ్, జాగ్వార్, హెర్క్యులస్ యుద్ధ విమానాల చక్కర్లు
  • రాత్రివేళ కూడా ల్యాండింగ్  సౌకర్యం 
  • దేశంలో ఈ ప్రత్యేకత ఉన్న ఒకే ఒక్క ఎక్స్​ప్రెస్ వే

షాజహాన్​పూర్:  ఎంతో కాలంగా ఆసక్తితో ఎదురుచూసిన గంగా ఎక్స్ ప్రెస్  వే శుక్రవారం అందుబాటులోకి వచ్చింది. ఈ ఎక్స్ ప్రెస్ వేపై మన ఫైటర్‌‌‌‌  జెట్లు డ్రిల్స్‌‌  షురూ చేశాయి. ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్ పూర్  జిల్లా పిరూ గ్రామానికి సమీపంలో నిర్మించిన ఈ ఎక్స్ ప్రెస్ వేపై భారత వాయుసేన (ఐఏఎఫ్) యుద్ధ విమానాల ల్యాండింగ్, టేకాఫ్​ను అట్టహాసంగా ప్రారంభించింది. రఫేల్, ఎస్ యూ30 ఎంకేఐ, మిరాజ్  2000, మిగ్ 29, జాగ్వార్, సీ 130జే సూపర్  హెర్క్యులస్, ఏఎన్ 32, ఎఐ17 వీ5 హెలికాప్టర్లు డ్రిల్స్ లో పాల్గొన్నాయి. రాత్రిపూట కూడా ఈ ఎక్స్ ప్రెస్ వేపై ఫైటర్  జెట్లను ల్యాండ్  చేయవచ్చు. దేశంలో ఇలాంటి ప్రత్యేకత ఉన్న ఒకేఒక్క ఎక్స్ ప్రెస్  గంగా ఎక్స్ ప్రెస్  వేనే. 

అంతకుముందు లక్నో–ఆగ్రా, పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ వేస్ లో యుద్ధ విమానాలను ఎమర్జెన్సీ ల్యాండింగ్  డ్రిల్స్  చేసేవారు. ప్రస్తుతం ఆ రికార్డు గంగా ఎక్స్ ప్రెస్  హైవే సొంతమైంది. దీంతో రక్షణ రంగంలో దేశం మరో మైలురాయిని దాటింది. ఇక డ్రిల్స్  చూసేందుకు స్థానికులతో పాటు వివిధ స్కూళ్ల నుంచి స్టూడెంట్లు భారీ సంఖ్యలో తరలివచ్చారు. డిఫెన్స్  రంగానికి చెందిన ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొన్నారు. ఫైటర్ జెట్ల విన్యాసాలు చూసి విద్యార్థులు, స్థానికులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఎమర్జెన్సీ వేళల్లో ప్రత్యామ్నాయ రన్ వేగా గంగా ఎక్స్ ప్రెస్ వే ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. యుద్ధ విమానాల డ్రిల్స్​తో ఈ ఎక్స్ ప్రెస్ వే సామర్థ్యం ప్రపంచానికి తెలిసిందని పేర్కొన్నారు. ‘‘మొత్తం 250 సీసీటీవీ కెమెరాలతో ఎక్స్ ప్రెస్ వేను అభివృద్ధి చేశాం. సెక్యూరిటీలో ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా, ఎప్పుడూ నిఘా ఉండేలా ఏర్పాట్లు చేశాం. ఎక్స్ ప్రెస్ వే పూర్తయ్యాక యూపీలో ఇది నాలుగో ఎమర్జెన్సీ ఎయిర్ స్ట్రిప్  అవుతుంది” అని అధికారులు వెల్లడించారు. కాగా.. డ్రిల్స్  నిర్వహణ నేపథ్యంలో భారీగా సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.