అస్సాంలో కూలిన సుఖోయ్‌‌..ఇద్దరు పైలట్లు మృతి

అస్సాంలో కూలిన సుఖోయ్‌‌..ఇద్దరు పైలట్లు మృతి

న్యూఢిల్లీ: రెండ్రోజులుగా కనిపించకుండాపోయిన సుఖోయ్‌‌ ఫైటర్‌‌‌‌ జెట్‌‌ కూలిపోయినట్లు ఇండియన్‌‌ ఎయిర్‌‌‌‌ ఫోర్స్‌‌(ఐఏఎఫ్‌‌) అధికారులు నిర్ధారించారు. ఈ ఘటనలో ఐఏఎఫ్‌‌ ఫ్లైట్ లెఫ్టినెంట్‌‌ పుర్వేష్‌‌ దురగ్కర్‌‌‌‌(28), స్క్వాడ్రన్‌‌ లీడర్‌‌‌‌ అనుజ్‌‌ మృతి చెందినట్లు ప్రకటించారు. గత గురువారం అస్సాంలోని కార్బి అంగ్లాంగ్‌‌ జిల్లాలోని జోర్హాట్‌‌ ఎయిర్‌‌‌‌బేస్‌‌ ట్రైనింగ్‌‌ సెంటర్‌‌‌‌ నుంచి టేకాఫ్‌‌ అయిన సుఖోయ్‌‌ ఎంకేఐ యుద్ధ విమానం కొద్దినిమిషాల్లోనే కనిపించకుండాపోయింది.

రాడార్‌‌‌‌తో కాంటాక్ట్‌‌ మిస్‌‌కావడంతో ఐఏఎఫ్‌‌ బృందాలు వెతకడం ప్రారంభించాయి. ఎయిర్‌‌ ‌‌బేస్‌‌కు 60 కిలోమీటర్ల దూరంలోని కార్బి అంగ్లాంగ్‌‌ ప్రాంతంలో ఆ విమానం కూలినట్లు గుర్తించాయి. ఈ ప్రమాదంలో చనిపోయిన ఇద్దరూ 47 స్క్వాడ్రన్‌‌కు చెందినవారని ఐఏఎఫ్‌‌ వెల్లడించింది. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని పేర్కొంది.

మహారాష్ట్రలోని నాగ్‌‌పూర్‌‌‌‌కు చెందిన పుర్వేష్ గత ఏడాది మే నెలలో జరిగిన ఆపరేషన్ సిందూర్‌‌లో పాల్గొన్నారు. 10 రోజుల కిందే ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో గడిపారు. పుర్వేష్ తండ్రి రవీంద్ర దురగ్కర్ మీడియాతో మాట్లాడుతూ.. తన కొడుకు ఐఏఎఫ్‌‌లో పనిచేస్తున్నందుకు చాలా గర్వపడేవాడని, దేశం అంటే ఎంతో ఇష్టంతో ఎయిర్‌‌‌‌ఫోర్స్‌‌లో చేరాడని కన్నీటిపర్యంతమయ్యారు.