ఫార్ములా ఈ కార్ రేస్ కేసు..మూడోసారి ఏసీబీ విచారణకు అర్వింద్ కుమార్

ఫార్ములా ఈ కార్ రేస్ కేసు..మూడోసారి ఏసీబీ విచారణకు అర్వింద్ కుమార్

ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో 2025, జూలై 3వ తేదీ ఉదయం 11.30 గంటలకు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అరవింద్ కుమార్‎ను పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అర్వింద్ కుమార్ ను ఏసీబీ రెండు సార్లు విచారించింది. 


గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ లో ఫార్ములా ఈ కార్ రేసింగ్ పోటీలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో అవకతవకలు జరిగాయని.. నిబంధనలకు విరుద్ధంగా నిధుల చెల్లింపు జరిగిందన్న అభియోగాలపై ఏసీబీ కేసు నమోదు చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏ1, ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ ఏ2, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డిని ఏ3 నిందితులుగా చేర్చారు. ఇప్పటికే కేటీఆర్, అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలను ఏసీబీ విచారించింది. 2025, జూన్ లో కేటీఆర్ ను ఏసీబీ రెండోసారి విచారించింది. 

ఫైనాన్స్ డిపార్టుమెంట్ అనుమతి లేకుండా రూ.55 కోట్లు నగదు రెండు దఫాలుగా విదేశీ కంపెనీకి చెల్లించాల్సిందిగా HMDAను నాటి మంత్రి కేటీఆర్ ఆదేశించారనేది ఆరోపణ.  దురుద్దేశంతో నిధులు బదిలీ చేయమని ఆదేశించారా? తన లబ్ది కోసం చెల్లించమన్నారా?  మూడో పార్టీకి లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారా?  HMDA నిధుల దుర్వినియోగం, అనుమతి లేకుండా నిధులు బదిలీ జరిగాయా? లేదా? అనేది విచారణలో తేలనున్నది.