సూరజ్ పూర్: కరోనా రూల్స్ ఉల్లంఘించినందుకు ఛత్తీస్ గడ్, సూరజ్ పూర్ కలెక్టర్ రణబీర్ శర్మ.. ఓ యువకుడిపై చేయి చేసుకున్నాడు. అతడి సెల్ ఫోన్ నేలకొసి కొట్టాడు. అంతటితో ఆగకుండా యువకుడి చెంప చెళ్లుమనిపించాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న పోలీసులతో యువకుడిని లాఠీలతో కొట్టించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్ లో వైరల్ అయ్యాయి దీంతో నెటిజన్లు కలెక్టర్ పై ఫైర్ అయ్యారు.
యువకుడు బయటకు రావడానికి కారణం చెబుతున్నా వినకుండా, అతను చూపిస్తున్న పేపర్ ను కనీసం పట్టించుకోకుండా కొట్టడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పెద్దఎత్తున విమర్శలు రావడంతో కలెక్టర్ శర్మ సారీ చెప్పారు. యువకుడిపై తనకు ఎలాంటి కోపం లేదని రణబీర్ శర్మ చెప్పారు. మరోవైపు ఈ ఘటనపై ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ భగేల్ సీరియస్ అయ్యారు. సూరజ్ పూర్ కలెక్టర్ గా రణబీర్ శర్మను తొలగించారు. ఆయన స్థానంలో గౌరవ్ కుమార్ ను నియమించారు. మరోవైపు శర్మ తీరును IASల అసోసియేషన్ కూడా తప్పుబట్టింది.
