
తెలంగాణ పంచాయతీ రాజ్ మంత్రి సీతక్కను ఐఏఏస్ అధికారిణి స్మితా సబర్వాల్ కలిశారు. ఇవాళ ఉదయం సీతక్క సెక్రటేరియట్ లోని తన ఛాంబర్ లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా స్మితసబర్వాల్ సెక్రటేరియట్ కు వెళ్లి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.
కేసీఆర్ హయాంలో కీలకంగా వ్యవహరించిన స్మిత సబర్వాల్.. తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా కాళేశ్వరం పనులతోపాటు మిషన్ భగీరథ పనులను పర్యవేక్షించారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఇప్పటి వరకు ఆమె ఇంత వరకు ఎవర్నీ కలవలేదు. దీంతో స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీసుల్లోకి వెళ్తున్నారని ప్రచారం జరిగింది.
అయితే కేంద్ర సర్వీసుల్లోకి వెళ్తున్నానంటూ వస్తున్న వార్తలను ఖండించారు స్మితా సబర్వాల్. అవన్ని అవాస్తవమని తాను ఎక్కడికి వెళ్ళడం లేదని ట్విట్టర్లో వెల్లడించారు. తాను రాష్ట్రంలోనే పనిచేస్తానని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తనకు ఏ బాధ్యత అప్పజెప్పినా నిర్వహిస్తానని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంలో భాగమైనందుకు తాను గర్విస్తున్నట్లు చెప్పారు.