CP Sajjanar: 'ఐబొమ్మ'తో రూ. 20 కోట్లు వెనుకేసుకున్న రవి.. నేర చరిత్ర బయటపెట్టిన సీపీ సజ్జనార్!

CP Sajjanar: 'ఐబొమ్మ'తో రూ. 20 కోట్లు వెనుకేసుకున్న రవి.. నేర చరిత్ర బయటపెట్టిన సీపీ సజ్జనార్!

భారతీయ చిత్ర పరిశ్రమకు పట్టిన పైరసీ రక్కసి కింగ్‌పిన్‌ 'ఐబొమ్మ' నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. ఏకంగా పోలీసులకే సవాల్ విసిరిన రవిని పట్టుకున్న తరువాత, హైదరాబాద్ సీపీ వి.సి. సజ్జనార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.. ఈ సమావేశంతో సినీ పైరసీతో రవి అక్రమ సంపాదన, నేర చరిత్ర అంతార్జాతీయ లింకులపై గురించి విసృతపోయే విషయాలను బయటపెడ్డారు.

రూ. 20 కోట్లు అక్రమ సంపాదన.. 

 బీఎస్సీ కంప్యూటర్స్ చదివిన విశాఖపట్నం వాసి ఇమ్మడి రవి, కేవలం పైరసీ ద్వారా ఇప్పటివరకు రూ. 20 కోట్లకు పైగా అక్రమంగా సంపాదించాడని సీపీ సజ్జనార్ వెల్లడించారు. ఈ సంపాదనలో రూ. 3 కోట్లను పోలీసులు సీజ్ చేశారు. రవి అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి, సినిమా విడుదలైన రోజు ఉదయం లేదా సాయంత్రానికే హెచ్‌డీ ప్రింట్‌లను అప్‌లోడ్ చేసేవాడు.  పోలీసులు వెంటపడుతున్నారని తెలిసి, రవి తన భారత పౌరసత్వాన్ని వదులుకుని, కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ దేశ పౌరసత్వం తీసుకున్నాడని సీపీ తెలిపారు.  ఫ్రాన్స్‌లో ఉంటూ, అమెరికా, స్విట్జర్లాండ్‌, నెదర్లాండ్స్‌ వంటి దేశాలలో సర్వర్‌లను ఏర్పాటు చేసుకుని పైరసీ దందాను నడిపాడని వివరించారు.

21 వేల సినిమాల సీజ్

రవి హార్డ్‌డిస్కుల్లో 21,000 సినిమాలు లభించాయని సీపీ సజ్జనార్ వెల్లడించారు.. ఇందులో 1972లో వచ్చిన 'గాడ్ ఫాదర్' వంటి పాత క్లాసిక్స్ నుంచి, ఇటీవల విడుదలైన 'ఓజీ' వంటి కొత్త సినిమాలు కూడా ఉన్నాయన్నారు. రవి 110 డొమైన్స్ కొనుక్కుని, ఒక వెబ్‌సైట్‌ను బ్లాక్ చేస్తే మరొకటి ఓపెన్ చేస్తూ 65 మిర్రర్ వెబ్‌సైట్లను నిర్వహించాడని తెలిపారు. వాటన్నింటిని బ్లాక్ చేసినట్లు వెల్లడించారు. రవిపై ఐటీ యాక్ట్, కాపీ రైట్ యాక్ట్ కింద మరో 4 కేసులు నమోదయ్యాయి. ఈ రాకెట్‌లో ఉన్న మిగతా నిందితులను పట్టుకునేందుకు జాతీయ సంస్థల సహాయం తీసుకుంటామని, త్వరలో వారందరినీ బయటకు తీసుకొస్తామని సీపీ సజ్జనార్ తెలిపారు.

 బెట్టింగ్ దందా..  ప్రమాదంలో 50 లక్షల డేటా.

మహారాష్ట్రలో వేరే పేర్లతో డ్రైవింగ్ లైసెన్స్‌లు, పాన్ కార్డులు తీసుకుని చట్టం కన్నుగప్పేందుకు ప్రయత్నించాడు రవి.. ఐబొమ్మ వెబ్‌సైట్ ద్వారా రవి కేవలం పైరసీ చేయడమే కాక, నిషేధిత బెట్టింగ్ యాప్‌లను భారీగా ప్రమోట్ చేశాడు. దీని వల్ల చాలా మంది ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడటం లేదా డిజిటల్ అరెస్ట్‌లు అవ్వడం జరిగిందని సీపీ సజ్జనార్ వివరించారు. మరో ప్రమాదకరమైన విషయం ఏమిటంటే, రవి దగ్గర 50 లక్షల మంది సబ్‌స్క్రైబర్ల వ్యక్తిగత డేటా ఉంది. ఈ సున్నితమైన సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని సీపీ సజ్జనార్ హెచ్చరించారు.