ఉమెన్స్ క్రికెట్ ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్

ఉమెన్స్ క్రికెట్ ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్

క్రికెట్ చరిత్రలో మొట్టమొదటి సారిగా ఉమెన్స్ క్రికెట్ ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ను ఐసీసీ ప్రకటించింది. 2022 నుంచి 2025 వరకు అన్ని ఫార్మాట్లలో ద్వైపాక్షిక సిరీస్ల షెడ్యూల్ను ప్రకటించింది. ఐసీసీ ఉమెన్స్ ఛాంపియన్ షిప్లో భాగంగా 10 జట్లు వన్డే సిరీస్లు ఆడనున్నాయి. ఈ టోర్నీ ద్వారా టీమ్స్కు భారత్ లో 2025లో జరిగే వన్డే వరల్డ్ కప్కు అర్హత సాధించే అవకాశం ఉంటుంది. 2022 నుంచి 2025 ఉమెన్స్ ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్లో భాగంగా ఐసీసీ ఈవెంట్లతో పాటు..అన్ని సిరీస్లను కలుపుకుని దాదాపు 300కు పైగా మ్యాచులు జరగనున్నాయి. ఇందులో 7 టెస్టులు, 135 వన్డేలు, 159 టీ20 మ్యాచులున్నాయి.

పాక్తో ఒక్క సిరీస్ లేదు..
2022 నుంచి 2025 వరకు భారత ఉమెన్స్ టీమ్..59 మ్యాచులు ఆడనుంది. ఆసీస్, ఇంగ్లాండ్,  శ్రీలంక, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌, ఐర్లాండ్‌, విండీస్‌లతో  టీమిండియా క్రికెట్ ఆడబోతుంది.  ఇందులో కొన్ని ద్వైపాక్షిక, ట్రైసిరీస్‌లు ఉన్నాయి. అయితే దాయాది పాకిస్తాన్తో  ఒక్క సిరీస్‌ కూడా లేదు. ఇక 2023 డిసెంబర్‌లో టీమిండియా.. ఆస్ట్రేలియా,ఇంగ్లాండ్‌తో ఒక్కో టెస్టు ఆడనుంది. FTPలో భాగంగా మల్టీ ఫార్మాట్‌లో -ఆసీస్- ఇంగ్లాండ్‌ మధ్య రెండు యాషెస్‌ సిరీస్‌లు జరుగుతాయి. ఒక టెస్టు, మూడు వన్డేసి వన్డేలు, టీ20లతో కూడిన సిరీస్‌ను ఆయా దేశాల పిచ్‌ల మీద జరగనున్నాయి. ఇంగ్లాండ్, ఆసీస్, భారత్, సౌతాఫ్రికా టీమ్స్ మాత్రమే టెస్టులు ఆడతాయి. ఇతర జట్లు ఎక్కువగా టీ20 సిరీస్‌లను ఆడనున్నాయి. 

2022 నుంచి 2025 వరకు టీమిండియా టూర్..
2022 సెప్టెంబర్ 10 నుంచి 24 వరకు ఇంగ్లాండ్‌తో భారత్ 3  టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. ఆ తర్వాత 2022 డిసెంబర్‌లో  ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌లో పాల్గొంటుంది. 2023 జనవరిలో సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌, భారత్‌తో కూడిన ట్రై సిరీస్‌లో నాలుగు టీ20లు ఆడనుంది. 2023 జూన్‌లో బంగ్లాదేశ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20ల్లో పాల్గొననుంది.  సెప్టెంబర్‌-అక్టోబర్‌ 2023లో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ లు ఆడనుంది. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో మూడు టీ20లు, మూడు వన్డేలు, డిసెంబర్‌ 2023లో ఇంగ్లాండ్‌తో ఒక టెస్టు, మూడు టీ20లను భారత్ ఆడబోతుంది.  డిసెంబర్‌ 2023లోనే ఆసీస్‌తో ఒక టెస్టు, మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ లలో పాల్గొనబోతుంది.  నవంబర్‌ 2024లో ఆసీస్‌తో ఆస్ట్రేలియా వేదికగా మూడు వన్డేల సిరీస్ జరగనుంది. డిసెంబర్‌ 2024లో విండీస్‌తో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ నిర్వహించబోతుంది.  జనవరి 2025లో ఐర్లాండ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీసూ జరగనుంది. వీటితో పాటు.. ఫిబ్రవరి 2023లో సౌతాఫ్రికాలో టీ20 ప్రపంచకప్, సెప్టెంబర్‌-అక్టోబర్‌ 2024లో బంగ్లాదేశ్‌ వేదికగా మళ్లీ టీ20 వరల్డ్ కప్,  సెప్టెంబర్‌-అక్టోబర్‌ 2025లో స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్‌లో భారత్ పాల్గొంటుంది.

FTPతో మరోస్థాయికి ఉమెన్స్‌ క్రికెట్‌.. 
ఎఫ్‌టీపీ షెడ్యూల్‌తో  మహిళల క్రికెట్ మరో స్థాయికి చేరుకుంటుందని ఐసీసీ జనరల్ మేనేజర్‌ వసీమ్‌ ఖాన్‌ తెలిపారు. ఎఫ్‌టీపీ కేవలం భవిష్యత్తు పర్యటనల కోసమే కాకుండా మహిళా క్రికెట్‌ పునాదిని పటిష్ఠపరిచేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు.  న్యూజిలాండ్‌లో జరిగిన ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ హోరాహోరీగా జరిగిందని.. అందుకే ఎఫ్‌టీపీలో మరిన్ని మ్యాచ్‌లను నిర్వహించాలని నిర్ణయించినట్లు ఐసీసీ జనరల్ మేనేజర్‌ వసీమ్‌ ఖాన్‌ వెల్లడించారు.