ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ICC) లేటెస్టుగా టెస్ట్ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్ ప్రకటించింది. ఇందులో టీమిండియా ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, చతేశ్వర్ పుజారాలు చెరో స్థానం కోల్పోయి ఐదు, ఏడు ర్యాంకులకు పడిపోయారు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో ఈ ఇద్దరు ఆటగాళ్లు చెరో ఆఫ్ సెంచరీ సాధించినప్పటికీ ర్యాంకింగ్స్‌లో ఒక్కో స్థానం కోల్పోయారు. మరోవైపు ఇదే మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో అదరగొట్టిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్(218) రెండు స్థానాలను మెరుగుపరచుకొని మూడో ర్యాంక్‌కు చేరుకోగా, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ ఒకటి, రెండు స్థానాల్లో కొనసాగుత్నున్నారు. మరో ఆసీస్ ఆటగాడు లబుషేన్ ఒక స్థానాన్ని కోల్పోయి నాలుగో ర్యాంక్‌కు పడిపోయాడు.
పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ బాబర్ అజామ్, కివీస్ ఆటగాడు హెన్రీ నికోల్స్, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్, ఆసీస్ ఓపెనర్ వార్నర్‌లు తలో స్థానాన్ని మెరుగుపరచుకొని 6,8,9,10 స్థానాల్లో నిలిచారు. టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ చెన్నై టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 91 పరుగులు చేయడంతో మొదటి సారిగా 700 రేటింగ్ పాయింట్లు సాధించి 13వ స్థానాన్ని దక్కించుకున్నాడు.
